: జర్మనీలో బయటపడిన రెండో ప్ర‌పంచ యుద్ధ కాలం నాటి బాంబు.. నిర్వీర్యం చేయ‌డానికి 70 వేల మంది స్థానికులను ఖాళీ చేయించిన వైనం!

జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్ వ‌ద్ద విస్మేర‌ర్ స్ట్రాస్ ప్రాంతంలో ఓ పురాత‌న బాంబు దొరికింది. దీన్ని రెండో ప్ర‌పంచ యుద్ధ కాలానికి చెందిన బాంబుగా గుర్తించారు. దాన్ని నిర్వీర్యం చేయ‌డానికి ఆ ప్రాంతం చుట్టుప‌క్క‌ల నివ‌సించే 70వేల మందిని ఖాళీ చేయించారు. ఆదివారం నాడు బాంబు నిర్వీర్య ప్ర‌క్రియ ప్రారంభించ‌నున్న‌ట్లు ఫ్రాంక్‌ఫ‌ర్ట్ పోలీసులు తెలిపారు. 1.8 ట‌న్నుల బ‌రువున్న ఈ బాంబును రెండో ప్రపంచ యుద్ధం జ‌రుగుతున్న‌పుడు బ్రిటీషు వాయుసేన ద‌ళాలు వ‌దిలి ఉంటాయ‌ని పోలీసులు చెప్పారు.

 ఈ బాంబుకు ఒక కిలోమీట‌ర్ ప‌రిధి మేర‌ ఉన్న భ‌వ‌నాలను నాశ‌నం చేయ‌గ‌ల శ‌క్తి ఉంద‌ని వారు పేర్కొన్నారు. యుద్ధం జ‌రుగుతున్న‌పుడు దాదాపు 2.7 మిలియ‌న్ ట‌న్నుల బాంబుల‌ను అమెరికా, బ్రిటీష్ వాయుసేన ద‌ళాలు ప్ర‌యోగించిన‌ట్లు ఓ నివేదిక వెల్ల‌డించింది. వీటిలో స‌గానికి పైగా బాంబులు జ‌ర్మ‌నీ మీదే వేసిన‌ట్లు తెలుస్తోంది. వీటిలో ప‌ది శాతం బాంబులు పేల‌క‌పోవ‌డంతో అప్పుడ‌ప్పుడు ఇలా ఏదైనా నిర్మాణం కోసం భూమి త‌వ్విన‌పుడు బ‌య‌ట‌ప‌డుతుంటాయి.

More Telugu News