: రైతుల‌కు ద‌ళారీ ర‌హిత మార్కెట్‌ను సృష్టించేందుకు బ్యాంక‌ర్ ఉద్యోగాన్ని వ‌దిలేశాడు!

ప్ర‌తీక్ శ‌ర్మ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ వ‌ద్ద ఓ మారుమూల గ్రామం ధాబా ఖుర్ద్‌లో జ‌న్మించాడు. 8వ త‌ర‌గ‌తి అక్క‌డే చ‌దువుకుని అత‌ని పై చ‌దువుల కోసం ప్ర‌తీక్ కుటుంబం భోపాల్‌కు మ‌కాం మార్చింది. అప్ప‌టివ‌ర‌కు వ్య‌వ‌సాయంలో త‌న కుటుంబానికి ప్ర‌తీక్ సాయం చేసేవాడు. చ‌దువులు పూర్త‌య్యాక ప్ర‌తీక్‌కి కోట‌క్ మ‌హీంద్ర బ్యాంక్‌లో చీఫ్ మేనేజ‌ర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ప‌దేళ్ల పాటు బ్యాంకులో ప‌నిచేశాడు. అదే బ్యాంకులో ప‌నిచేసే ప్ర‌తీక్ష‌ను వివాహం కూడా చేసుకున్నాడు. ఒక‌రోజు ప్ర‌తీక్ తన సొంత‌ గ్రామానికి వెళ్లాడు. అక్క‌డి ప‌రిస్థితి చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. గ్రామం ఎంత మాత్రం మార‌లేదు. 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.

వ్య‌వ‌సాయం మీద ఆస‌క్తితో సెల‌వు రోజుల్లో భోపాల్ నుంచి 100కి.మీ. ప్ర‌యాణం చేసే త‌న గ్రామంలో ఉన్న 5 ఎక‌రాల్లో కూర‌గాయ‌లు పండించ‌డం ప్రారంభించాడు. 2015 వచ్చేస‌రికి అత‌ని కూరగాయ‌లు చేతికందాయి. వాటిని అమ్మితే మంచి లాభాలు వ‌స్తే బ్యాంకు ఉద్యోగం వ‌దిలేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాడు. కానీ లాభాలు రాలేదు. కార‌ణం మ‌ధ్య‌వ‌ర్తులు! ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్న ప్ర‌తీక్ మార్కెట్‌లో ఉన్న ఇత‌ర రైతుల‌ను సంప్ర‌దించాడు. వారు కూడా ద‌ళారీల కార‌ణంగానే పెట్టుబ‌డికి త‌గిన లాభాలు రావ‌డంలేద‌ని చెప్పారు. దీంతో రైతుల‌కోసం ప్ర‌త్యేకంగా ఒక ద‌ళారీ ర‌హిత‌ మార్కెట్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకున్నాడు.

ప్ర‌తీక్‌కి మ‌రో చ‌దువుకున్న రైతు విన‌య్ యాద‌వ్ స‌హాయం తోడైంది. వీరిద్ద‌రూ మిగ‌తా రైతుల‌తో క‌లిసి `క‌ల్ప‌వ‌ల్లి గ్రీన్స్ ప్రొడ్యూస్డ్ కంపెనీ లిమిటెడ్‌` ప్రారంభించారు. దీని ద్వారా సేంద్రియ ప‌ద్ధ‌తిలో కూర‌గాయ‌లు పండించి, అమ్మ‌డం మొద‌లు పెట్టారు. మొద‌టి ఏడాది అనుకున్న లాభాలు రాక‌పోవ‌డంతో మిగ‌తా రైతుల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా వారికి రావాల్సిన మొత్తాల‌ను ప్ర‌తీక్‌, విన‌య్‌లు చెల్లించి, న‌ష్టాల‌ను వారు భ‌రించారు. త‌ర్వాతి ఏడాది నుంచి మంచి లాభాలు రావ‌డంతో భార్య ప్ర‌తీక్ష స‌ల‌హా మేర‌కు ప్ర‌తీక్ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

ప్ర‌తిరోజు త‌న కారులో రైతుల నుంచి కూర‌గాయ‌లు సేక‌రించి, వాటిని భోపాల్‌లో అమ్మ‌డం ప్రారంభించాడు. వాట్సాప్ గ్రూప్‌లు, సోష‌ల్ మీడియాల‌తో పాటు త‌న మార్కెటింగ్ నైపుణ్యాల‌ను ఉప‌యోగించి కూర‌గాయ‌ల అమ్మ‌కాల‌ను పెంచాడు ప్ర‌తీక్‌. ప్రస్తుతం వారానికి రెండు సార్లు కూర‌గాయ‌ల‌ను మార్కెట్‌కి త‌ర‌లిస్తున్నాడు. 330కు పైగా వినియోగ‌దారులు ఉన్నారు. ఈ మార్పు చూసి ఇత‌ర రైతులు కూడా ప్ర‌తీక్ క్ల‌బ్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన వ్య‌వ‌సాయం చేయ‌డంలో ఉండే సంతృప్తి బ్యాంకు మేనేజ‌ర్‌గా చేస్తున్న‌పుడు త‌న‌కు ల‌భించ‌లేద‌ని ప్ర‌తీక్ చెబుతున్నాడు.

More Telugu News