: మలుపులున్నా దూసుకెళ్తాయ్... టిల్టింగ్ రైళ్ల కోసం స్విస్ తో భారత్ కీలక ఒప్పందం

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 దేశాలకు మాత్రమే పరిమితమైన టిల్టింగ్ రైళ్లు ఇండియాకూ రానున్నాయి. ఎలాంటి మలుపులోనైనా వేగంగా వెళ్లగలిగే ఈ రైళ్ల కోసం స్విట్జర్లాండ్ తో ఇండియా కీలక ఒప్పందాన్ని చేసుకుంది. టర్నింగ్ లు వచ్చిన చోట ఏ మాత్రం వేగాన్ని తగ్గకుండా వెళ్లిపోవడం ఈ రైళ్ల ప్రత్యేకత. ఈ తరహా రైళ్లు ప్రస్తుతం ఇటలీ, పోర్చుగల్, సాల్వేనియా, ఫిన్ ల్యాండ్, రష్యా, చెక్ రిపబ్లిక్, యూకే, స్విట్జర్లాండ్, చైనా, జర్మనీ, రొమేనియా దేశాల్లో మాత్రమే ఉన్నాయి.

వాస్తవానికి గంటకు 100 కిలోమీటర్లకు మించిన వేగంతో రైళ్లు మలుపులు తిరిగితే, అందులో నిలబడ్డ వాళ్లు ఓ పక్కకు ఒరిగిపోతారు. కూర్చున్న వాళ్లు, తమ ఆర్మ్ రెస్ట్ లపై బలంగా పడతారు. ఈ రైళ్లలో అటువంటి పరిస్థితి ఉండదు. మలుపును, ప్రయాణిస్తున్న వేగాన్ని బట్టి, చక్రాలు వంపు తిరుగుతూ బోగీని వంచకుండా చూస్తాయి. గత సంవత్సరం జూలైలో స్విస్ దౌత్యాధికారి ఇండియాకు వచ్చిన సందర్భంగా ఈ డీల్ తొలిసారి ప్రస్తావనకు రాగా, ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షురాలి పర్యటనలో ఇరు దేశాల మధ్యా ఎంఓయూ కుదిరింది. స్విస్ ఫెడరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ది ఎన్విరాన్ మెంట్, ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ తో రైల్వే మంత్రిత్వ శాఖ ఇరు దేశాల నేతల సమక్షంలో డీల్ కుదుర్చుకుంది. ఈ రైళ్లు ఇండియాకు వస్తే, మలుపులు అధికంగా ఉండే కొంకణ్ రైల్వే కార్పొరేషన్ కు తొలిగా అందుతాయి.

More Telugu News