: వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు?: కేటీఆర్ కు మంచు లక్ష్మి లేఖ

వినాయక చవితి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వల్ల ప్రజలు పడుతున్న బాధల పట్ల ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసిన వేలాది విగ్రహాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా లేఖ రాశారు. తాను ఫిల్మ్ నగర్ లోని రోడ్డు నంబర్-1లో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన మండపాలు, స్వాగత తోరణాల కారణంగా జనాలు అవస్థలు పడుతుండటాన్ని గమనించానని... వీటి కారణంగా ట్రాఫిక్ కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.

పెద్ద విగ్రహాల ఏర్పాటు కోసం కేబుళ్లను సైతం తెంచి పడేస్తున్నారని... పండుగ ముగిసిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తున్నారని... దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని లక్ష్మి ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే మతపరమైన పండుగను జరుపుకుంటున్నట్టు లేదని... పోటీ కోసం విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే మండపాలను ఏర్పాటు చేయాలని మంత్రికి సూచించారు. ఇలాంటి మండపాలపై తక్షణ చర్యలు తీసుకుని, ఇబ్బందుల నుంచి ప్రజలను కాపాడాలని కోరారు. అలాగే విగ్రహాల ఎత్తు కూడా నిబంధనలకు లోబడి ఉంటే బాగుంటుందని తెలిపారు. మట్టి విగ్రహాలకు ఆదరణ పెరగడం ఆనందంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ పరిశుభ్రత బాధ్యత అందరి మీదా ఉందని తెలిపారు.  

More Telugu News