'భగత్ సింగ్' పాత్రను చేయాలనుండేది!: చిరంజీవి

23-08-2017 Wed 11:31
సుదీర్ఘమైన తన నట ప్రస్థానంలో చిరంజీవి ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చారు. ఆ పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో ఒక సినిమా చేయాలనే కోరిక తనకి ఎప్పటి నుంచో ఉందని చిరంజీవి అన్నారు.

ముఖ్యంగా భగత్ సింగ్ పాత్రను పోషించాలనే కోరిక బలంగా ఉండేదని చెప్పారు. ఎందుకనో గానీ ఆ పాత్రను చేయడం కుదరలేదని అన్నారు. ఆ కోరిక ఇప్పుడు 'సైరా నరసింహా రెడ్డి' సినిమా చేస్తుండటంతో తీరుతోందని చెప్పారు. ఓ స్వాతంత్ర్య సమయోధుడి చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నందుకు చాలా గర్వంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారీ తారాగణంతో .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా తెరకెక్కుతుందని చెప్పుకొచ్చారు.