: నంద్యాలలోనే ప్రధాన నేతల మకాం... రేపటితో మూగబోయే మైకులు!

నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం తుది దశకు చేరుకుంది. 23న ఎన్నికలు జరగనుండగా, రేపటితో ప్రచారానికి తెరపడనుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయనుండగా, ఆపై నియోజకవర్గానికి చెందిన వారు తప్ప మరెవరూ కనిపించరాదని, బయటివారు అందరూ నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ను వీడి వెళ్లిపోవాలని ఇప్పటికే ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు మలివిడత ప్రచారంలో భాగంగా వరుసగా రెండో రోజు నేడు ప్రచారం సాగించనున్నారు. నిన్న రాత్రి 11 గంటల వరకూ సాగిన చంద్రబాబు ప్రచారం, నేటి ఉదయం తిరిగి ప్రారంభమైంది. మరోవైపు దాదాపు 10 రోజుల నుంచి సాగుతున్న విపక్ష నేత జగన్, నేడు, రేపు కూడా నంద్యాలలో ఉండి ప్రచారం సాగించాలని నిర్ణయించుకున్నారు. రేపు సాయంత్రం తరువాతనే ఆయన నంద్యాలను వీడుతారని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, ఈ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని అటు టీడీపీ, ఇటు వైకాపా నమ్మకంగా చెబుతున్న పరిస్థితి నెలకొంది. తాము చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టనున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించగా, రోడ్డు పక్కన ఇళ్లు పడగొట్టి దాన్నే అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటున్నారని, ప్రజలు తమ ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని జగన్ కోరుతున్నారు.

More Telugu News