: మార్పుకు సంకేతం... మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బలాన్ని పెంచుకున్న కాంగ్రెస్

మధ్యప్రదేశ్ లో జరిగిన పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది. ఎన్నికలకు ముందు పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు మరణించడం, తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతుల ఆందోళన తదితరాల నేపథ్యంలో, తాజా ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతమని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. మొత్తం స్థానాల్లో బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 14 చోట్ల విజయభేరీ మోగించింది. జ్యోతిరాదిత్య సింథియా సొంత ప్రాంతమైన దర్బాను మాత్రం కాంగ్రెస్ పోగొట్టుకుంది.

ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీపై ప్రజలకు నమ్మకం సడలలేదని అన్నారు. తమ సిట్టింగ్ స్థానాలను తాము గెలుచుకున్నామని తెలిపారు. రైతుల ఆందోళనలు ఏమీ ప్రభావం చూపలేదని తెలిపారు. కాగా, 2012లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 37 పురపాలికల్లో బీజేపీ 25 చోట్ల గెలువగా, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఆరేసి స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 చోట్ల గెలిచింది. ఈ ఫలితాలు తమకెంతో ఆనందాన్ని కలిగించాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా తెలిపారు. నాలుగు చోట్ల కేవలం వందల ఓట్ల తేడాతో మాత్రమే తాము ఓడిపోయామని, బీజేపీ పాలన ప్రజలకు నచ్చడం లేదని ఈ ఎన్నికలతో అర్థమైందని అన్నారు.

More Telugu News