: ఎంత అదృష్టం నాది?: తిరుమలలో వెంకయ్యనాయుడు

భారత ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టనుండటం, తన జీవితంలో దక్కిన అత్యంత అదృష్టమని మాజీ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన, వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మరో నాలుగు రోజుల్లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నానని, ఆ నేపథ్యంలోనే స్వామివారి దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులతో కలసి వచ్చానని తెలిపారు.

భారత రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. తిరుమలకు వచ్చిన వెంకయ్యకు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. ఆపై రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందించారు. కాగా, నేడు చంద్రగ్రహణం సందర్భంగా నేటి సాయంత్రం నుంచి శ్రీవారి ఆలయం మూతపడనుంది. తిరిగి రేపు ఉదయం శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

More Telugu News