: ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల రాజీనామాల‌పై స్పందించిన ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా

గ‌త కొన్ని నెల‌లుగా త‌మ కంపెనీలో కొన‌సాగుతున్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల‌ రాజీనామాల ప‌ర్వంపై ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా స్పందించారు. ఈ రాజీనామాల వెన‌క ఎలాంటి బ‌ల‌మైన కార‌ణం లేద‌ని, ఇవి సాధార‌ణంగా జ‌రుగుతున్న‌వేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా మిగ‌తా కంపెనీల‌తో పోల్చిన‌పుడు త‌మ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ బోర్డు రాజీనామాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంద‌ని త‌మ స‌ర్వేలో తేలిన‌ట్లు సిక్కా వివ‌రించారు. ఇన్ఫోసిస్ సీఈఓగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సిక్కా మీడియాతో మాట్లాడారు.

`రాజీనామాలు అనేది అన్ని కంపెనీల్లో జ‌రుగుతాయి. మా కంపెనీ నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం మిగ‌తా కంపెనీల్లో కూడా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల రాజీనామాలు అధికంగానే ఉన్నాయి` అని ఆయ‌న అన్నారు. రాజీనామాలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది విశాల్ సిక్కాతో పాటుగా జ‌ర్మ‌న్ కంపెనీ శాప్ నుంచి వ‌చ్చిన‌వారే కావ‌డంతో కంపెనీలో అంత‌ర్యుద్ధం ఏదో జ‌రుగుతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం అస‌త్య‌మ‌ని సిక్కా ప్ర‌క‌టించారు. కంపెనీకి అంత‌ర్గ‌తంగా స‌మ‌స్య‌లు ఉన్న మాట నిజ‌మేగానీ, అవి ఉద్యోగుల‌కు సంబంధించిన‌వి కావ‌ని, కంపెనీ అభివృద్ధికి సంబంధించిన స‌మ‌స్య‌లని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

More Telugu News