: పవన్ కల్యాణ్ ప్రకటనపై ఉత్కంఠ.. జనసేనాని ప్రకటనతో మారనున్న నంద్యాల అభ్యర్థుల తలరాతలు!

నంద్యాల ఉప ఎన్నికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తారో అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికల ముందు వస్తున్న ఈ ఎన్నికలో గెలుపు ఇటు టీడీపీకి, అటూ వైకాపాకు రెండు పార్టీలకూ కీలకమే. ఈ నేపథ్యంలో టీడీపీకి పవన్ మద్దతు ప్రకటిస్తారా? లేక తటస్థంగానే ఉండిపోతారా? అనే విషయంపై టెన్షన్ నెలకొంది. అమరావతిలో సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, నంద్యాల ఉప ఎన్నికలో ఎవరికి మద్దతు ఇస్తాననే విషయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. దీంతో, పవన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు టీడీపీ, వైసీపీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. గెలుపు కోసం ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నియోజకవర్గంలో బలిజలు, ముస్లింలు, ఆర్య వైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 42వేల మంది బలిజ ఓటర్లు ఉన్నారు. ఒకవేళ పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటిస్తే, ఆయన నిర్ణయం ఈ సామాజికవర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. టీడీపీకి బలిజ ఓట్ల శాతం మరింత పెరుగుతుంది. నియోకవర్గంలో ఉన్న 25 వేల నుంచి 35 వేల మంది పవన్ కల్యాణ్ అభిమానులు (కులాలకు సంబంధం లేకుండా) పవన్ ఏది చెబితే దాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఆయన అభిమానులు, సేవాదళ్ సాధారణ కార్యకర్తలు, పవన్ కల్యాణ్ ఆశయ సాధన సమితి సభ్యులు ఉన్నారు.

మరోవైపు మంత్రి భూమా అఖిలప్రియ నిన్న మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. ఆయన మద్దతు తమకే ఉంటుందని చెప్పారు. 

More Telugu News