: జియో ఉచిత ఫోన్ పై మెలికపెట్టిన రిలయన్స్!

రూ. 1500 డిపాజిట్ చేసి, రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ సొంతం చేసుకుంటే, మూడేళ్ల తరువాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించి, భారత టెలికం రంగంలో మరో సంచలనానికి తెరలేపిన రిలయన్స్, తాజాగా, ఓ మెలిక పెట్టింది. హెచ్ఎస్బీసీ తాజాగా విడుదల చేసిన ఓ రిపోర్టులో రిలయన్స్ సంస్థ అనలిస్టులో జరిగిన సమావేశం వివరాలను ప్రచురించింది. రూ. 1500 ఫోన్ పొందిన వినియోగదారులు, మూడేళ్ల పాటు ప్రతి నెలా రీచార్జ్ చేసుకుంటేనే పూర్తి మొత్తాన్ని మూడేళ్ల తరువాత వెనక్కు చెల్లిస్తామని, ఒకవేళ, మధ్యలో రీచార్జ్ చేసుకోకుంటే, పూర్తి మొత్తం ఇవ్వబోమని సంస్థ అధికారులు స్పష్టం చేసినట్టు హెచ్ఎస్బీసీ వెల్లడించింది.

 కాగా, ఈ జియో ఫోన్ తో పాటే కేబుల్ ప్రసారాలను టీవీలో చూసే కేబుల్ ను కూడా అందిస్తామని రిలయన్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లో ఉన్న డీటీహెచ్ సంస్థలు ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. ఫోన్ కేబుల్ తో టీవీ అనుసంధానమై ఉన్నప్పుడు మాత్రమే టీవీలో ప్రసారాలను చూడవచ్చు. ఫోన్ ను బయటకు తీసుకువెళితే, టీవీలో ప్రసారాలు చూసే వీలుండదు. ఈ విషయాన్నే ప్రధానంగా చర్చిస్తున్న డీటీహెచ్ సంస్థలు, జియో ఫోన్ కేబుల్ ఫ్లాప్ అవుతుందని భావిస్తున్నాయి. ఇక ఫోన్ ద్వారా కేబుల్ టీవీ కావాలంటే నెలకు రూ. 309 చెల్లించాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అంతకన్నా తక్కువకే తాము సేవలందిస్తున్నామని గుర్తు చేస్తున్నాయి.

More Telugu News