: పూర్ణిమకు ఎంత తెంపరితనం... ఒంటరిగా 40 రోజులు.. అందులో 15 రోజులు షిర్డీలో మకాం!

గత నెల 7వ తేదీన అదృశ్యమై, 40 రోజుల తరువాత ఆచూకీ లభించిన పూర్ణిమ సాయి, ఈ మధ్యకాలంలో తాను ఏం చేశానన్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. పూర్ణిమ ముంబైలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, హుటాహుటిన ముంబై చేరుకోగా, ఈ 40 రోజుల్లో జరిగిన విషయాలను వివరించింది. జూన్ 7వ తేదీ నుంచి 15 రోజుల పాటు తాను షిర్డీలో గడిపానని చెప్పుకొచ్చింది. గుడిలోనే తింటూ, అక్కడే కాలం గడిపానని, తనను ఎవరూ ఏమీ అడగలేదని చెప్పింది. ఆపై సినిమాల్లో చేరాలన్న కోరికతో ముంబైకి చేరుకున్నానని, డబ్బులు లేకపోవడంతోనే పోలీసు స్టేషన్ కు వెళ్లానని, ఎలాగైనా అవకాశాలు వచ్చేంతవరకూ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని అబద్ధాలు చెప్పానని పేర్కొంది.

 ఇక, 40 రోజుల పాటు తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని బలంగా నిర్ణయించుకోవడం, తాను అనాధనని, అనాధాశ్రమం నుంచి వచ్చానని ఆమె జంకు లేకుండా అసత్యాలు చెప్పడం ఆమె తెంపరితనానికి, మనసులో నాటుకుపోయిన బలమైన కోరికలకూ నిదర్శనమని మానసిక విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వుందని, తల్లిదండ్రులు కూడా పిల్లల కోరికలను, వారి తీరును గమనిస్తూ ఉండాలని సూచించారు. పదిహేనేళ్ల బాలిక 40 రోజుల తరువాత క్షేమంగా ఉండటం అదృష్టమని భావించవచ్చని, ఇదే అవకాశం ఇంటి నుంచి పారిపోయే అందరికీ లభ్యం కాదని హెచ్చరిస్తున్నారు. కాగా, ఇప్పటికి కూడా పూర్ణిమ సాయి తనంతట తానుగా బయటపడకపోవడం గమనార్హం. హైదరాబాద్ పోలీసులు పంపిన ఫోటోలను చూసి అనుమానించిన ముంబై పోలీసులు ఆమె గతంలో తమ వద్దకు వచ్చిన విషయాన్ని గుర్తించి, ఆ సమాచారాన్ని ఇక్కడికి పంపారన్న సంగతి తెలిసిందే. 

More Telugu News