: కేరళ స్కూలు వినూత్న ప్రయోగం.. నడిచి వచ్చే విద్యార్థుల బ్యాగుల కోసం ప్రత్యేకంగా బస్సు!

నడుం వంగిపోయేలా స్కూలు బ్యాగులు మోసే విద్యార్థులకు కేరళలోని ఒక స్కూలు శుభవార్త చెప్పింది. సమీపంలోని విద్యార్థులు ఇక పుస్తకాల బ్యాగులు మోసుకు రావాల్సిన పనిలేదని పేర్కొంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ బస్సును ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. స్కూలు నిర్ణయం విన్న విద్యార్థులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. నిర్దేశించిన పాయింట్లలో స్కూలు వ్యాన్ ఆగుతుందని, అక్కడ పుస్తకాల బ్యాగును అప్పజెబితే సరిపోతుందని కన్నూరులోని కట్టంపల్లిలో ఉన్న జీఎం అప్పర్ ప్రైమరీ స్కూలు యాజమాన్యం తెలిపింది. దీని వల్ల విద్యార్థులు చేతిలో ఎటువంటి బరువు లేకుండా ఉత్త చేతులతో స్కూలుకు నడుచుకుంటూ రావచ్చని పేర్కొంది. ఈ సరికొత్త ప్రయోగం వల్ల 300 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని వివరించింది.

భుజాన బ్యాగు లేకుండా స్కూలుకు రావడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కాగా,  ప్రస్తుతం ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందిస్తున్నా భవిష్యత్తులో ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.15-20ల నామమాత్రపు ఫీజు వసూలు చేయాలని స్కూలు యాజమాన్యం భావిస్తోంది. అది కూడా నిర్వహణ చార్జీలకు మాత్రమేనని చెబుతోంది.

More Telugu News