: ట్రంప్ కు మరో మాజీ అధికారి షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సెనెట్ కమిటీ ముందు విచారణకు హాజరైన ఎఫ్బీఐ మాజీ డెరెక్టర్ జేమ్స్ కోమీ తనను ట్రంప్ ప్రలోభపెట్టారని, అధికార దర్పం చూపించే ప్రయత్నం చేశారని 7 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బాటలో భారత సంతతికి చెందిన అమెరికా మాజీ అటార్నీ ప్రీత్ భరారా కూడా ట్రంప్ తనను కూడా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మూడు సార్లు ట్రంప్ ఫోన్ చేయగా, తొలిసారి మాట్లాడేందుకు నిరాకరించిన తాను, రెండు సార్లు మాట్లాడానని చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్ టవర్ కు ఆహ్వానించిన ట్రంప్, తనను అటార్నీగా కొనసాగాలని సూచించారని చెప్పారు.

అయితే అటార్నీగా వ్యక్తిగత ఆసక్తులకు దూరంగా ఉండాలన్న వృత్తి ధర్మం మేరకు మార్చ్ నెలలో ట్రంప్ తో మాట్లాడేందుకు నిరాకరించానని చెప్పారు. ఆ తరువాత రెండు సార్లు ఫోన్ చేశారని అన్నారు. కాగా, న్యూయార్క్‌ రాష్ట్ర అటార్నీగా తప్పుకునేందుకు నిరాకరించిన భరారాను ఆ పదవి నుంచి ట్రంప్‌ తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జేమ్స్ కోమే వాంగ్మూలంతో అమెరికాలో వివాదం రేగింది. తాజాగా ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను న్యాయస్థానం తప్పు పట్టింది. ఇప్పుడు మాజీ అటార్నీ ఆరోపణలు చేయడంతో ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నట్టే కనిపిస్తోంది.

More Telugu News