: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చుక్కెదురు.. సమన్లు జారీ చేసిన ‘జిట్’

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో ఆయనకు జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జిట్) సమన్లు జారీ చేసింది. జూన్ 15న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. విదేశాల్లో షరీఫ్ కుటుంబానికి భారీగా అక్రమాస్తులు  ఉన్నట్టు పనామా పేపర్స్ లీక్ చేసింది. దీంతో ఆయనపై  పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 20న ప్రధానిపై విచారణకు ఆదేశించింది. రెండు నెల్లలో దర్యాప్తు పూర్తిచేయాలని జిట్‌కు సూచించింది.

ఈ దర్యాప్తు బృందంలో ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ), ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ), సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ఎస్‌ఈసీపీ), స్టేట్ బ్యాంక్ అండ్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ప్రతినిధులు ఉన్నారు.

ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం.. షరీఫ్ ఇస్లామాబాద్‌లోని జిట్ తాత్కాలిక ప్రధాన కార్యాలయంలో సంబంధిత పత్రాలతో గురువారం ఉదయం 11:30 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది. కాగా, కజక్‌స్థాన్‌లో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొని శనివారమే షరీఫ్ పాక్ చేరుకున్నారు. ఆ వెంటనే ఆయనకు సమన్లు జారీ చేయడం గమనార్హం.

More Telugu News