: ద‌క్షిణ చైనా స‌ముద్రంలో అమెరికా యుద్ధనౌక... అమెరికా తీరుపై భగ్గుమన్న చైనా!

ద‌క్షిణ చైనా స‌ముద్రంపై తమకు మాత్రమే అధికారం ఉంద‌ని చెబుతున్న చైనా.. ఆ స‌ముద్రంలోకి అమెరికా త‌మ యుద్ధ‌నౌక‌ను పంప‌డం ప‌ట్ల భ‌గ్గుమంది. ఇది తమ సార్వ‌భౌమాధికారాన్ని ఉల్లంఘించ‌డ‌మేన‌ని తేల్చి చెప్పింది. స్పార్ట్‌లీ దీవుల్లోని మిస్‌చీఫ్ రీఫ్‌లో 20 కిలోమీట‌ర్ల మేర అమెరికాకు చెందిన ఆ యుద్ధ‌నౌక ప్రవేశించింది. అమెరికా త‌ల‌పెట్టిన‌ తొలి ఫ్రీడ‌మ్ ఆఫ్ నేవిగేష‌న్ ఆప‌రేష‌న్‌లో భాగంగా ఆ నౌక ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈ నౌక‌తో గైడెడ్ మిస్సైల్స్‌ను ధ్వంసం చేయ‌వ‌చ్చు. దీనిపై మాట్లాడిన పెంటగాన్ అధికార ప్ర‌తినిధి జెఫ్ డేవిస్ తాము అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు లోబ‌డే ద‌క్షిణ చైనా స‌ముద్రంతోపాటు ఏషియా-ప‌సిఫిక్ ప్రాంతంలోని స‌ముద్ర జ‌లాల్లో ప్ర‌తిరోజు త‌మ యుద్ధ‌నౌక‌ల‌ను తిప్పుతామ‌ని వ్యాఖ్యానించారు.

ఆయ‌న ఇచ్చిన జ‌వాబు ప‌ట్ల సంతృప్తి చెంద‌ని చైనా త‌మ అనుమ‌తి లేకుండా ఆ యుద్ధ‌నౌక‌ ఎలా ప్ర‌వేశిస్తుంద‌ని అడిగింది. చేసిన త‌ప్పును స‌రిదిద్దుకోవాల‌ని అమెరికాకు సూచించింది. అమెరికా, చైనాల మ‌ధ్య స‌త్సంబంధాలు కొనసాగాలంటే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించింది. ఇలాంటి రెచ్చ‌గొట్టే చర్య‌ల‌కు దిగ‌కూడ‌ద‌ని చెప్పింది.                     

More Telugu News