: ఇండియాలో బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్

ఇండియాలో నోట్ల రద్దు తరువాత బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. గడచిన డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ తగ్గగా, మార్చితో ముగిసిన త్రైమాసికంలో 16 శాతం మేరకు పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక 'గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్' పేర్కొంది. ఇండియాలో మొత్తం 92.3 టన్నుల బంగారు ఆభరణాలకు డిమాండ్ ఏర్పడిందని, దీని కారణంతో ప్రపంచ డిమాండ్ సైతం 1 శాతం పెరిగి 480 టన్నులను దాటిందని తెలిపింది. మార్చి త్రైమాసికంలో ఇండియాలో మొత్తం బంగారం డిమాండ్, 2016తో పోలిస్తే 15 శాతం పెరిగి 123.5 టన్నులకు చేరుకుందని వెల్లడించింది.

ఈ మూడు నెలల కాలంలో నోట్ల రద్దు తరువాత కనుమరుగైన కరెన్సీలో 85 శాతం విలువైన కరెన్సీ తిరిగి వ్యవస్థలోకి వచ్చిందని, ఈ కారణంతోనే బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని అభిప్రాయపడింది. జీఎస్టీ అమల్లోకి వస్తే, ధర పెరగవచ్చన్న అంచనాలు కూడా ముందుగానే కొనుగోళ్లకు ప్రయత్నించేలా కస్టమర్లను ప్రభావితం చేశాయని అంచనా వేసింది. ఈ సంవత్సరం మొత్తం మీద 650 నుంచి 750 టన్నుల బంగారానికి డిమాండ్ రావచ్చని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 15 శాతం అధికమని వెల్లడించింది. రుతుపవనాలు సంతృప్తికరంగా ఉండి, దిగుబడి పెరిగి, గిట్టుబాటు ధర రైతులకు లభిస్తే, బంగారం అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత ఎండీ పీఆర్ సోమసుందరం వ్యాఖ్యానించారు.

More Telugu News