: నూతన ఆవిష్కరణ: వైన్ తో వస్త్రాలు రూపొందించిన శాస్త్రవేత్తలు!

పత్తి లేదా నార నుంచి తీసిన దారాలతో దుస్తులు తయారు చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే... అయితే యూనివర్సిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆస్ట్రేలియా బయోల్లాయి ల్యాబ్‌ కు చెందిన శాస్త్రవేత్తలు వైన్‌, బీరులను కేవలం తాగడానికి మాత్రమే కాదు దుస్తులు తయారు చేసేందుకు కూడా వినియోగించవచ్చని నిరూపించారు. వైన్, బీరుతో దుస్తులు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వైన్‌ ను బాగా పులియబెట్టి వస్త్రంగా మార్చారు. ‘యాక్సెటోబేటర్‌’ అని పిలిచే బాక్టీరియా కల్చర్‌ తో అసాధారణ, విప్లవాత్మకమైన వస్త్రాన్ని సృష్టించారు. ఈ విధానంలో బాగా పులిసిన రెడ్‌ వైన్‌ ను బాక్టీరియా సూక్ష్మనూలిపోగులతో కూడిన పదార్థంగా మార్చేస్తుందని వారు చెప్పారు. అలా మారిన ఈ పదార్థాన్ని మనిషి ఆకృతిలో ఉన్న బొమ్మకు అంటిస్తారు.

అలా అంటించినది పూర్తిగా ఆరిన తరువాత ఏ బొమ్మకైతే అంటించారో దాని ఆకృతిని ఇది పోతపోసుకుంటుంది. అనంతరం దానిని సరిపడే మనుషులు ధరించే వస్త్రంగా మారుస్తారు. ఇది చూసేందుకు దూదిలా ఉంటుందని వారు చెబుతున్నారు. ఇలాంటి వస్త్రాలను రూపొందించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పత్తి కొరతను తగ్గించేందుకు వీలవుతుందని వారు చెబుతున్నారు. అయితే ఈ నూతన వస్త్రం బాగా బలహీనంగా ఉందని, దీనిని మరిన్ని పరిశోధనలతో బలంగా ఉండేలా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. ప్రస్తుతానికి తాము వైన్ తో వస్త్రాన్ని తయారు చేశామని, ఇదే విధానంలో బీరుతో కూడా వస్త్రాన్ని తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. 

More Telugu News