hdfc robo: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో దర్శనమివ్వనున్న రోబోలు!

ప్ర‌యివేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీలో త్వ‌ర‌లోనే రోబోలు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి. ‘ఇరా’ పేరిట రూపొందించిన ఈ హ్యూమనాయిడ్‌ సర్వీసులను తమ ముంబయి నగర శాఖలో ప్రారంభించనున్నట్లు ఆ బ్యాంకు పేర్కొంది. ఈ రోబోను నిన్న ఆవిష్క‌రించారు. కొచ్చికి చెందిన అసిమోవ్‌ రోబోటిక్స్‌ భాగస్వామ్యంతో ఈ రోబోను రూపొందించామ‌ని హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగం హెడ్‌ నితిన్‌ చుగ్ తెలిపారు.

బ్యాంకులో ఈ రోబో అందించే సేవ‌ల‌పై వివ‌రాల‌ను ఇంకా తెలప‌లేదు. ఈ రోబోను బ్యాంకులో రిసెప్షనిస్టులాగా ఉప‌యోగిస్తార‌ని తెలుస్తోంది. గ‌తేడాది సిటీ యూనియన్‌ బ్యాంక్ కూడా ’లక్ష్మి’ పేరుతో ఇటువంటి రోబోను ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఆ రోబో 125కు పైగా అంశాలను హ్యాండిల్‌ చేయగ‌లిగే స‌త్తా ఉంది.

దేశం న‌గ‌దు ర‌హిత లావాదేవీల వైపుకి న‌డుస్తున్న నేప‌థ్యంలో అందుకు సంబంధించిన సాంకేతిక‌త‌ను అభివృద్ధి చేసేలా తా‌ము స్టార్టప్ కంపెనీల‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు చుగ్ తెలిపారు. మ‌రోవై‌పు స్టార్టప్‌లకు సాయ‌ప‌డేందుకు ఉద్దేశించిన రెండో విడత సమిట్‌ను త‌మ‌ బ్యాంక్‌ ప్రారంభించింద‌ని చెప్పారు. ఇందుకు సంబంధించిన‌ తొలి విడత సమిట్‌లో 100 ఎంట్రీలు వ‌చ్చాయ‌ని, 35 స్టార్టప్‌ సంస్థలు కొత్త ఐడియాలను త‌మ ముందు ఉంచాయ‌ని పేర్కొన్నారు. త‌మ‌ బ్యాంకుతో పనిచేసేందుకు వాటిలో ఐదు సంస్థ‌ల‌కు అవకాశం దక్కిందని తెలిపారు.

More Telugu News