demonitisation: భారీగా నకిలీ రూ.2000 నోట్ల ముద్రణ... ప్రింటింగ్ మిషన్ స్వాధీనం!

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కొత్త‌గా వ‌చ్చిన నోట్ల ఫీచ‌ర్‌ల‌పై ఇంకా ప్ర‌జ‌ల‌కి స‌రైన అవ‌గాహ‌న ఏర్ప‌డ‌లేదు. ఇదే అదునుగా భారీ మొత్తంలో న‌కిలీ నోట్లను ముద్రించి వాటిని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు కొంద‌రు దుండ‌గులు. ఈ నేప‌థ్యంలోనే గుజ‌రాత్‌లోని ఖేడా జిల్లాలో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ పోలీసులు బోపాల్ ప్రాంతంలోని బంగళాలో ఓ నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్ను స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.12.45 లక్షల నగదు ప‌ట్టుబ‌డింది. వాటిలో అధికంగా కొత్త రూ.2000 నకిలీ నోట్లే ఉన్నాయి. అంతేగాక వారి వ‌ద్ద నుంచి నోట్ల ముద్రణకు తీసుకొచ్చిన ఖాళీ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ విష‌య‌మై పోలీసులు మాట్లాడుతూ... హనుమాన్మధీ సమీపంలో ఇటీవ‌ల ఇద్ద‌రు వ్య‌క్తులు న‌కిలీ రూ.2000, రూ.500 నోట్లతో ప‌ట్టుబ‌డ్డార‌ని, వారిని విచారించ‌గా తాము దాడులు జ‌రిపిన ప్రాంతంలో న‌కిలీ నోట్లు త‌యారు చేస్తున్న‌ట్లు వారు చెప్పార‌ని అన్నారు. తాము బంగళాలో జరిపిన సెర్చ్ ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్న న‌కిలీ నోట్ల మిష‌న్‌తో పాటు ఓ కారులోంచి కూడా మ‌రో మిష‌న్‌ను రికవరీ చేశామ‌ని అన్నారు. ఈ న‌కిలీ నోట్ల గ్యాంగ్‌ అహ్మదాబాద్కు చెందిందని తెలిపారు. న‌కిలీ నోట్ల‌ను ముద్రించి ప‌లువురికి కమీషన్ ఆశ చూపి వాటిని మార్పిడి చేస్తున్నారని చెప్పారు.

More Telugu News