: ఇన్వెస్టర్లను ఒక్క రోజులో రూ. 30 వేల కోట్లకు పైగా ముంచిన కాగ్నిజంట్... మున్ముందు మరిన్ని కష్టాలు!

మల్టీ నేషనల్ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ టెక్నాలజీస్ సంస్థపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇండియాలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, నివేదిక బయటకు రానున్న వేళ, సంస్థ దీర్ఘకాల ఉద్యోగి, ప్రస్తుత అధ్యక్షుడు, ఆరోపణలు వచ్చిన 2012లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్న గోర్డాన్ కోబుర్న్ రాజీనామా చేయడం ఆ సంస్థకు అశనిపాతమైంది. గత వారాంతంలో కాగ్నిజంట్ లో ఇన్వెస్టర్ల సంపద 4.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 30,150 కోట్లు) హరించుకుపోగా, ముందుముందు మరిన్ని కష్టాలను సంస్థ అనుభవించనుందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరంలో ఇప్పటికే సంస్థ వ్యాపారం దెబ్బతినడంతో రెండు సార్లు భవిష్యత్ ఆదాయ అంచనాలను కాగ్నిజంట్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక బ్రోకరేజి సంస్థలు కాగ్నిజంట్ ఈక్విటీని విక్రయించి ప్రస్తుతానికి బయటపడితే మంచిదని సలహాలు ఇస్తున్నాయి. దాదాపు మూడేళ్ల తరువాత సంస్థ ఈక్విటీ భవిష్యత్ అంచనా తగ్గడం గమనార్హం. సమీప భవిష్యత్తులో ఈక్విటీ విలువ 55 డాలర్ల నుంచి 68 డాలర్ల మధ్య ఉండవచ్చని సిటీగ్రూప్ అంచనా వేసింది. విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయన్నది ఊహించలేకపోయినా, సంస్థ అధ్యక్షుడు కోబుర్న్ రాజీనామాతో పరిస్థితి ఆందోళనకరమేనన్న సంకేతాలు వెలువడినట్లయిందని సిటీగ్రూప్ ప్రతినిధి అశ్విన్ షిర్వైకర్ వెల్లడించారు. ఇండియాలో కొన్ని కాంట్రాక్టుల కోసం యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, మధ్యవర్తుల ద్వారా సంస్థ లంచాల బాగోతానికి తెర లేపినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణలో ప్రాథమిక సాక్ష్యాలు లభ్యంకాగా, అప్పట్లో సీఎఫ్ఓగా ఉన్న కోబుర్న్ రాజీనామా సంస్థ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. శుక్రవారంనాటి యూఎస్ సెషన్లో సంస్థ ఈక్విటీ విలువ 13.4 శాతం పడిపోయి 47.63 డాలర్లకు చేరగా, ఇది నేడు మరింతగా పతనమయ్యే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News