: పడిపోయిన 3జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు.. మార్కెట్‌లో 4జీ మోడళ్లదే హవా

వచ్చీ రావడమే సంచలన అమ్మకాలతో దుమ్మురేపిన 3జీ స్మార్ట్‌ఫోన్లకు ప్రస్తుతం కాలం చెల్లినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం యువత 4జీ ఫోన్లపై పడింది. రిలయన్స్ జియో ఆఫర్‌తో ఇది మరింత ఊపందుకుంది. దాదాపు అన్ని నెట్‌వర్క్‌లు 4జీ సర్వీసును ఇస్తుండడంతో యువత క్రమంగా 4జీ స్మార్ట్‌ఫోన్లపై దృష్టి సారించింది. రిలయన్స్ జియో మూడు నెలల పాటు ఉచిత సర్వీసులు అందిస్తున్నట్టు ప్రకటించడంతో ఆ సేవలను అందుకునేందుకు చాలామంది 3జీ నుంచి 4జీ స్మార్ట్‌ఫోన్లకు మారారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన 3 జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించకముందే 4జీ రంగ ప్రవేశం చేసింది. ఇది పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకముందే రిలయన్స్ జియో ప్రకటనతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. కేవలం సిమ్ పొందేందుకు కొందరు కొత్తగా 4జీ మొబైళ్లను కొనుగోలు చేశారంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు రూ.3వేల నుంచే ఈ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతుండడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ 4జీ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి. ఆరు నెలల క్రితం 40 శాతం మాత్రమే ఉన్న వీటి విక్రయాలు తాజాగా 80 శాతానికి చేరుకున్నాయంటే కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్ జియో లైఫ్ సిరీస్‌లో భాగంగా రూ.2999కే 4జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా శామ్‌సంగ్ రూ.4,699కే 4జీ మొబైల్‌ను విక్రయిస్తోంది. ప్రముఖ కంపెనీలన్నీ కొంచె అటూఇటుగా ఇదే ధరతో ఫోన్లు విక్రయిస్తుండడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

More Telugu News