: పైలట్ల సెల్ఫీలకు చెక్ చెప్పిన డీజీసీఏ.. ఆదేశాలు జారీ

ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి కాక్‌పిట్‌లో పైలెట్లు సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీచేసింది. ఇకముందు పైలెట్లు ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని డీజీసీఏ చీఫ్ భుల్లార్ హెచ్చరించారు. కొత్త నిబంధనలను త్వరలో ఆన్‌లైన్‌లో పెట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. చాలామంది పైలెట్లు కాక్‌పిట్‌లో సెల్ఫీలు తీసుకుంటూ వాటిని గర్వంగా సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తుండడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. సెల్ఫీలు తీసుకున్న పైలెట్లను గత నెలలో డీజీసీఏ వారం రోజుల పాటు విధులకు దూరంగా ఉంచగా, మరికొందరిని హెచ్చరించి వదిలేసిన సంగతి తెలిసిందే. కాగా చాలా దేశాలు కాక్‌పిట్‌లో పైలెట్లు సెల్ఫీలు తీసుకోవడాన్ని ఇప్పటికే నిషేధించాయి.

More Telugu News