: మీదేం పోయింది... పిల్లల్ని రెచ్చగొట్టి మీరు ఇళ్లలో సురక్షితంగా కూర్చుంటారు!: వేర్పాటువాదులపై మండిపడ్డ మెహబూబా ముఫ్తీ

జమ్మూకాశ్మీర్ లోని వేర్పాటువాదులపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనగర్ లో ఆమె మాట్లాడుతూ, పిల్లలను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవడం మానాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన యువత రాళ్లు పట్టుకుని రోడ్డెక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. ఉద్రేకంతో రాళ్లు చేబూని రోడ్డెక్కి, ఆ తరువాత ఎక్కడ అరెస్టు అవుతామో, లేక తీవ్రవాదిగా ఎక్కడ ముద్ర పడతామోనని భయం భయంగా బతుకుతున్నారని, ఈ దుస్థితి విద్యార్థులకు అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. 'వేర్పాటు వాదులదేం పోయింది. పిల్లలను రెచ్చగొట్టి ఇళ్లలో కూర్చుని తమాషా చూస్తారు. నష్టపోయేది పిల్లలే'నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారిని రక్షణ కవచాలుగా మార్చుకుని ఆందోళనలు చేస్తున్నారని, ఇలాంటి వాటిని తాను అస్సలు సహించనని, తనలో శక్తి ఉన్నంత వరకు అడ్డుకుంటానని ఆమె తెలిపారు.

More Telugu News