: అరుదైన శస్త్రచికిత్స చేసి పాకిస్థాన్ బాలుడికి పునర్జన్మ ప్రసాదించిన పంజాబ్ వైద్యులు

విభేదాలు పాకిస్థాన్ ప్రభుత్వంతోనే కాని అక్కడి ప్రజలతో కాదని నిరూపించారు పంజాబ్‌లోని లుధియానా వైద్యులు. అంపశయ్యపై ఉన్న 9 ఏళ్ల పాక్ బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు పోశారు. దాయాది దేశానికి చెందిన అహ్మద్ అరుదైన ‘బ్లూబేబీ’ అనే ప్రాణాంతక హృద్రోగ సమస్యతో బాధపడుతున్నాడు. సాధారణంగా గుండెలో నాలుగు గదులు ఉండగా బ్లూ బేబీతో బాధపడుతున్న వారిలో మూడు గదులే ఉంటాయి. దీంతో అహ్మద్ శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగినంత అందడం లేదు. ఫలితంగా పరిస్థితి రోజురోజుకు విషమించసాగింది. కుమారుడిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆరాటంతో తండ్రి అబ్‌దుస్సమాద్ జూలై 15న కుమారుడిని తీసుకుని లుధియానాలో అడుగుపెట్టాడు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాధిత బాలుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు లోపాన్ని గుర్తించారు. అన్ని పరీక్షలు పూర్తిచేసిన అనంతరం ఆగస్టు 1న అహ్మద్‌కు ఆపరేషన్ చేసి లోపాన్ని సరిదిద్ది ప్రాణం పోశారు. అహ్మద్‌కు నాలుగేళ్ల వయసులో ఓసారి ఆపరేషన్ జరిగినా కోలుకోలేకపోయాడని తండ్రి పేర్కొన్నాడు. తమదేశంలో వైద్య సదుపాయాలు అంతగా లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. లుధియాలోని ఆస్పత్రి గురించి తెలిసే ఇక్కడకు వచ్చామని చెప్పుకొచ్చాడు. కుమారుడు తిరిగి దక్కినందుకు చాలా ఆనందం ఉందని పేర్కొన్నాడు. ప్రతి వందమందిలో ఒకరికి ‘బ్లూ బేబీ‘ సమస్య వస్తుందని వైద్యులు తెలిపారు.

More Telugu News