: ఏపీ, తెలంగాణకు నీళ్ల పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్ సమావేశ విశేషాలివి!

ఎర్రమంజిల్‌ లోని జలసౌధలో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. నీటి పంపకాలతో పాటు బోర్డు నిర్వహణ మార్గదర్శకాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ ఏర్పాట్లు, ఉమ్మడి జలాశయాల నిర్వహణ నిధులు, కొత్త ప్రాజెక్టులు తదితర పది అంశాలతో కూడిన అజెండాపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఛైర్మన్‌ రామ్‌ చరణ్‌, సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీతో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషి, ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ నడుస్తుండడంతో జల అవసరాలు తీర్చాలని రెండు రాష్ట్రాలు బోర్డును కోరాయి. ఏపీ 47 టీఎంసీలు, తెలంగాణ 39 టీఎంసీల నీరు కావాలని కోరగా, నీటి కేటాయింపులపై రేపు జరగనున్న బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అదే సమయంలో కృష్ణానదీ జలాలతో నిండే చిన్న నీటివనరులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడాన్ని బోర్డు తప్పుపట్టింది. టెలిమెట్రీ ఏర్పాటు కోసం బోర్డు ప్రతినిధి బృందం ఈ నెల 29, 30 తేదీల్లో శ్రీశైలం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లిస్తోన్న గోదావరి జలాల అంశాన్ని కేంద్ర జలవనరుల శాఖ, అత్యున్నత మండలి చూసుకుంటాయని బోర్డు ప్రకటించింది.

More Telugu News