: టీడీపీ కంచుకోటపై జగన్ అస్త్రం!... తంబళ్లపల్లెలో వైసీపీ పదవికి పెరిగిన పోటీ!

టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని తంబళ్లపల్లె నియోజకవర్గం... ఆ పార్టీకి కంచుకోట కిందే లెక్క. టీడీపీ ఆవిర్భావం తొలినాళ్లలో అక్కడ టీడీపీకి అంతగా పట్టు లేకున్నా... అనతికాలంలోనే ఉమాశంకర్ రెడ్డి ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చారు. 1983లో రైతు కూలీ సంఘం నేతగా ఉన్న ఉమాశంకర్ రెడ్డిని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వయంగా పిలిచి మరీ టికెట్టిచ్చారు. అయితే ఎన్నికల్లో ఉమాశంకర్ రెడ్డి స్వల్ప తేడాతో ఓడినా... ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన ఎన్టీఆర్ ఆయనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి మరణించగా, ఆయన సతీమణి లక్ష్మీదేవమ్మ రెండు పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా అక్కడ నెగ్గారు. 2009లో ఆమె కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజకీయ తెరంగేట్రం చేసి సత్తా చాటారు. 2014 ఎన్నికలకు ముందు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి తల్లితో కలిసి వైసీపీలో చేరిపోయారు. అయితే 2014 ఎన్నికల్లో ప్రవీణ్ ను తిరస్కరించిన అక్కడి ప్రజలు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యువనేత శంకర్ యాదవ్ కు పట్టం కట్టారు. వెరసి వ్యక్తులు మారినా... తామంతా టీడీపీ వైపేనని తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు తేల్చేశారు. తాజాగా ఆ నియోజకవర్గంపై జగన్ సంధించిన ఓ అస్త్రం... వైసీపీలో జోరును పెంచింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి కనిపించకుండా పోయారు. రెండేళ్ల పాటు ప్రవీణ్ కోసం చూసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ చార్జీగా పార్టీ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డిని నియమించారు. దీంతో అప్పటిదాకా కనిపించకుండా పోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా ప్రత్యక్షమైపోయారు. తమను కాకుండా పుంగనూరుకు చెందిన నేతలకు నియోజకవర్గ పగ్గాలు ఎలా అప్పగిస్తారంటూ ఆయన అధిష్ఠాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు... ద్వారకానాథరెడ్డిని తప్పించి ఇన్ చార్జీ పగ్గాలు తనకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే... 2014 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలో చేరిన మాజీ మంత్రి కలిచర్ల ప్రభాకర్ రెడ్డి కూడా... ఉమాశంకర్ రెడ్డితో ఉన్న విభేదాలను పక్కనబెట్టి మరీ ప్రవీణ్ గెలుపు కోసం యత్నించారు. తాజాగా మరోమారు ప్రవీణ్ కు మద్దతు తెలిపిన ప్రభాకర్ రెడ్డి... ‘గడపగడపకు వైసీపీ’ పేరిట నియోజకవర్గంలో అడుగుపెడుతున్న ద్వారకానాథరెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఒకేఒక్క నిర్ణయంతో తంబళ్లపల్లెలో నేతలందరినీ బయటకు రప్పించిన జగన్... ఆ వివాదాల పరిష్కారానికి ఇంకెలాంటి అస్త్రం సంధిస్తారన్న విషయంపై చిత్తూరు జిల్లాలో పెద్ద చర్చే జరుగుతోంది.

More Telugu News