: అధికారి తీరుకు నిరసనగా తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల ఆందోళన

సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరావు తీరుకి నిర‌స‌న‌గా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తెలంగాణ సచివాలయం డి బ్లాక్‌లో ఈరోజు ఆందోళ‌న జరిపారు. శ్రీనివాసరావు తమను వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. ఉద్యోగులు సెలవులు కోరితే వారిపై ఆధిపత్య ధోర‌ణి క‌న‌బ‌రుస్తున్నార‌ని వారు అన్నారు. సెల‌వులు అడిగితే శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఆయన తీరుపై ఇప్ప‌టికే సీఎస్‌ రాజీవ్‌శర్మ వద్ద పిర్యాదు చేశామని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ తమకు న్యాయం జరగడం లేదని అన్నారు. స‌చివాల‌యంలో రెండు గంటలపాటు అన్ని బ్లాకులకు తిరుగుతూ ఉద్యోగులు ఈ నిర‌స‌న కార్యక్రమాన్ని నిర్వహించారు. త‌మ‌ను ఆర్థిక శాఖలో ఉన్న అధికారి వేధిస్తే ఆందోళ‌న చేశామ‌ని, అప్పుడు త‌మ పోరాటంలో గెలిచామ‌ని, ఇప్పుడు కూడా దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తోన్న సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్ సెక్రట‌రీని తొలగించేవరకు పోరాటం చేస్తామ‌ని వారు చెప్పారు.

More Telugu News