: సబితకు షాక్!... మాజీ హోంమంత్రికి గన్ మెన్ల ఉపసంహరణ!

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి హోం మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి... తెలుగు నేలలో తొలి మహిళా హోంశాఖ మంత్రిగా రికార్డు పుటల్లోకి ఎక్కారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత కూడా ఆమె హోం శాఖ మంత్రిగానే పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పార్టీకి వీచిన ఎదురుగాలి నేపథ్యంలో కాంగ్రెస్ విపక్షానికి పరిమితం కాగా... సబిత ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. తాజాగా తెలంగాణ సర్కారు ఆమెకు భారీ షాక్ ఇచ్చింది. మాజీ హోం మంత్రి హోదాలో ఆమెకు ఏర్పాటు చేసిన భద్రతను కొనసాగించలేమని ఆమెకు రాసిన ఓ లేఖలో ప్రభుత్వం తేల్చిచెప్పింది. తక్షణమే గన్ మెన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆ లేఖలో ప్రభుత్వం సబితకు వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆమెకు ఇంకా గన్ మెన్ల భద్రత కొనసాగుతోంది. ప్రభుత్వ లేఖ నేపథ్యంలో ఏ క్షణమైనా గన్ మెన్లు ఆమె వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తన భద్రతపై సబిత కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

More Telugu News