: యువత ఓట్లపై ట్రంప్ పెట్టుకున్న ఆశలు వదులుకోవాల్సిందేనట‌!

రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ ప‌డుతున్న‌ డొనాల్డ్ ట్రంప్ యువత ఓట్లపై ఆశలు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్ తో పోటీపడి ఓడిపోయిన బెర్నీ సాండర్స్ మద్దతుదారులైన యువత ఓట్ల‌ను కూడా రాబ‌ట్ట‌డానికి ఆయ‌న భారీగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, యువ‌త మాత్రం ఆయ‌న‌కు వ్య‌తిరేకంగానే ఉన్నార‌ట‌. తాజా పోల్‌లో ఈ అంశ‌మే తేట‌తెల్ల‌మైంది. అమెరికా యువత ఎక్కువగా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గు చూపుతున్నారని దీని ద్వారా తెలిసింది. దీంతో ఆయ‌న యువత ఓట్ల‌పై పెట్టుకున్న ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేన‌ని తెలుస్తోంది. 35 ఏళ్ల వయస్సులోపు ఉన్న అమెరికా ఓటర్లలో 56శాతం మంది ట్రంప్‌కి మ‌ద్ద‌తు తెల‌ప‌డం లేద‌ని యూఎస్ఏ టుడే/రాక్ ద ఓటర్ పోల్ లో తేలిపోయింది. దీని ప్ర‌కారం ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే ట్రంప్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌ని తేలింది. డెమొక్రటిక్ బెర్నీ సాండర్స్ మద్దతుదారులైన యువత ఓట్ల‌ను ట్రంప్ త‌న‌వైపు తిప్పుకోవాలని అనుకుని వేసిన గాలంతో ఫ‌లితం లేద‌ని ఈ పోల్ తేల్చిచెప్పింది. బెర్నీ సాండర్స్ మద్దతుదారుల్లో 72శాతం మంది హిల్లరీకే అండ‌గా నిలిచారు. ఆ దేశంలో 7.54 కోట్లమంది 18 నుంచి 34 ఏళ్లలోపు వ‌య‌సు వారే. వీరిలో మెజారిటీ యువత ట్రంప్ ప‌ట్ల సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు.

More Telugu News