: ప్రధాని మొదలు పెట్టిన పనుల వెంట పరుగులు పెడతాం: కేసీఆర్ ప్రతిజ్ఞ

ప్రధాని నరేంద్ర మోదీ గత వారంలో తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చి, శంకుస్థాపన చేసి వెళ్లిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేందుకు పరుగులు పెడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పంద్రాగస్టు ఉత్సవాల వేళ, గోల్కొండ కోటలో పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు డైరెక్టుగా రైళ్లు నడవాలన్నది లక్షలాది మందికి దశాబ్దాలుగా తీరని కోరికగా మిగిలిందని, దాన్ని సాకారం చేసేందుకు మనోహరాబాద్ - పెద్దపల్లి లైన్ కు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. అభివృద్ధి పనులకు సత్వర నిధులను మంజూరు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వాటాను కలిపి పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. సింగరేణిలో 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు జాతికి అంకితం కావడం తెలంగాణ వాసులందరికీ గర్వకారణమని తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. 35 పథకాలను పేదలకు అమలు చేస్తున్నామని, సంక్షేమ రంగంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని, మరింత మెరుగైన పాలన కోసం మరిన్ని పథకాలను తీసుకువస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కొత్తగా 250 గురుకుల పాఠశాలను మంజూరు చేశామని, వీటిలో 230 ఇప్పటికే ప్రారంభం కాగా, మరో 20 పాఠశాలలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని అన్నారు.

More Telugu News