: రూ. 5.81 లక్షల కోట్లకు చేరిన లిస్టెడ్ బ్యాంకుల తిరిగి రాని రుణం!

ఇండియాలోని లిస్టెడ్ బ్యాంకుల్లోని నిరర్ధక ఆస్తుల విలువ రూ. 5.81 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో అత్యధిక భాగం కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాల మొత్తం కాగా, మిగిలినది వ్యవసాయ రుణాల రూపంలో ఉన్నట్టు 'కాపిటలైన్' డేటా వెల్లడించింది. 2015 ఆర్థిక సంవత్సరంలో రూ. 3 లక్షల కోట్లుగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల మొత్తం ఏడాది తిరిగేసరికి దాదాపు రెట్టింపు పెరగడం వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతోందని నిపుణులు అంటున్నారు. బ్యాంకుల్లో అసెట్ క్వాలిటీ రివ్యూ (ఏక్యూఆర్) తరువాత వాస్తవ పరిస్థితి వెలుగులోకి వచ్చిందని, ఈ సంవత్సరం కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సి వుందని ఐసీఆర్ఏలో ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్ విభాగం అధిపతి వినా బాత్రా వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో బ్యాడ్ లోన్స్ ను తగ్గించుకునేందుకు కృషి చేయాల్సి వుందని అభిప్రాయపడ్డారు. 2016-17లో సైతం వ్యవసాయ రంగంలో కొంత రిస్క్ కనిపిస్తోందని అంచనా వేశారు. 2016 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో రూ. 21 వేల కోట్ల బ్యాడ్ లోన్స్ నమోదు కాగా, అందులో ఏక్యూఆర్ తరువాత రూ. 14 వేల కోట్లను వెనక్కు తెచ్చుకోవచ్చని నిర్ణయించినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య వివరించారు. నాలుగో త్రైమాసికంలో రూ. 30 వేల కోట్ల రుణంలో రూ. 9 వేల కోట్లను వెనక్కి తేగలమని తెలిపారు. ఈ మొత్తాన్ని మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో రిస్క్ ను మరింతగా తగ్గించడం, బ్యాంకుల్లో మూలనిధులను పెంచడం వంటి చర్యలకు మద్దతిస్తామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా వెల్లడించారు. కాగా, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఎన్పీఏ పెరుగుదలతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏ వేగంగా పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2015-16 క్యూ-4లో పీఎస్యూ బ్యాంకుల్లో రూ. 2.71 లక్షల కోట్లుగా, ప్రైవేటు బ్యాంకుల్లో రూ. 29.05 వేల కోట్లుగా ఉన్న స్థూల ఎన్పీయే మార్చి, 2016తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పీఎస్యూ బ్యాంకుల్లో రూ. 5.30 లక్షల కోట్లకు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ. 50.14 వేల కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర ఎన్పీయే ప్రభుత్వ బ్యాంకుల్లో రూ. 1.55 లక్షల కోట్ల నుంచి రూ. 3.15 లక్షల కోట్లకు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ. 11.65 వేల కోట్ల నుంచి రూ. 23.61 వేల కోట్లకు చేరింది.

More Telugu News