: ఢాకాలో చావుబతుకుల్లో యువకుడు.. ముంబై నుంచి వెళుతున్న అరుదైన రక్తం!

ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న యువకుడిని రక్షించేందుకు ప్రత్యేకంగా ముంబై నుంచి రక్తాన్ని తీసుకువెళుతున్నారు. ఢాకాకు చెందిన 25 ఏళ్ల కమ్రుజ్జమన్ గత నెల 21న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు చేతులతో పాటు పెల్విస్ (కటి వలయం) విరిగిపోయింది. అతడు ప్రాణాలతో బతికి బట్టకట్టాలంటే ఆపరేషన్ ఒక్కటే మార్గమని, అది కూడా వీలైనంత త్వరగా చేయాలని అక్కడి అపోలో వైద్యులు పేర్కొన్నారు. అయితే, అందుకు రక్తం అవసరం ఉండడంతో పరీక్ష చేసిన వైద్యులకు దిమ్మదిరిగిపోయింది. కమ్రజ్జమన్ బ్లడ్ అరుదైన 'బాంబే బ్లడ్ గ్రూప్'కు చెందినది. దొరకడం దాదాపు అసాధ్యం. బంగ్లాదేశ్ మొత్తం గాలించినా ఆ గ్రూప్ రక్తం దొరకలేదు సరికదా, అసలు ఆ బ్లడ్ గ్రూప్ పట్ల చాలా బ్లడ్ బ్యాంకులకు అవగాహన కూడా లేదట. చివరికి కుటుంబ సభ్యులకు పరీక్ష చేస్తే అతని సోదరిదీ అదే గ్రూప్ అని తేలినా ఆమె రక్తదానానికి పనికిరాలేదు. దీంతో ఆన్ లైన్లో వెతుకులాట ప్రారంభించారు. ఇండియాలో అది కూడా కేవలం 400 మంది లోపు మాత్రమే ఇలాంటి గ్రూప్ కు చెందిన వారున్నారని, వారిలో కూడా దానం చేసే వారు అతి తక్కువ మంది వున్నారని తెలిసింది. దీంతో ముంబైకి చెందిన ఎన్జీవో థింక్ ఫౌండేషన్ కు చెందిన వినయ్ షెట్టికి తమ గోడు వినిపించారు. ఆయన సహకారంతో ముంబైకి చెందిన స్వప్న సావంత్, కృష్ణానంద్ కోరి, బెహుల్ భెలీకర్, ప్రవీణ్ షిండే నుంచి నాలుగు యూనిట్ల బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం సేకరించారు. దీనిని తీసుకెళ్లేందుకు కమ్రుజ్జమన్ కొలీగ్ ఎస్కే తుహినుర్ ఆలం గురువారం ముంబై చేరుకున్నాడు. ఈ రక్తంతో తన స్నేహితుడు బతుకుతాడన్న నమ్మకం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. వారిచ్చింది నాలుగు యూనిట్ల రక్తం మాత్రమే కాదని, తన స్నేహితుడిపైనే ఆధారపడి ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు పునర్జన్మ కూడా అని కళ్లు చెమరుస్తుండగా చెప్పుకొచ్చాడు. ప్రత్యేక మైన ప్లాస్టిక్ బాక్సులో ఐస్ జెల్ ప్యాక్స్ నడుమ రక్తాన్ని ఢాకాకు తరలించనున్నారు. రక్తం ఢాకా చేరుకున్న వెంటనే బాధితుడికి శస్త్రచికిత్స చేయనున్నారు.

More Telugu News