: బుల్ డబుల్ జంప్... లక్ష కోట్ల రూపాయల లాభం!

బుధవారం నాడు అద్భుత రీతిలో 2 శాతానికి పైగా లాభపడ్డ భారత స్టాక్ మార్కెట్ నేడు కూడా అదే జోరును కొనసాగించింది. మార్కెట్ బుల్ వరుసగా రెండో రోజూ హైజంప్ చేయగా, ఇన్వెస్టర్ల సంపద లక్ష కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కు ఆఖరి రోజైన నేటి సెషన్ లో ఆరంభం నుంచే సూచికలు దూసుకెళ్లాయి. యూఎస్ పరపతి సమీక్ష అనంతరం వడ్డీ రేట్లను పెంచవచ్చని వచ్చిన వార్తలకు తోడు, క్రూడాయిల్ ధరలు మరోమారు అట్టడుగు స్థాయికి చేరబోవని వచ్చిన విశ్లేషణలు, రుతుపవనాలపై వాతావరణ శాఖ అంచనాలు వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచాయి. అటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఇటు దేశవాళీ సంస్థాగత సంస్థలు ఉత్సాహంగా ఈక్విటీలను కొనుగోలు చేసినట్టు బ్రోకరేజి వర్గాలు తెలిపాయి. నిఫ్టీ సూచిక చాలా నెలల తరువాత తిరిగి 8 వేల పాయింట్ల స్థాయిని అందుకోవడంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. బీఎస్ఈ సూచిక 26 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 485.51 పాయింట్లు పెరిగి 1.88 శాతం లాభంతో 26,366.68 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 134.75 పాయింట్లు పెరిగి 1.70 శాతం లాభంతో 8,069.65 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ ఒక శాతం, స్మాల్ కాప్ 0.86 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 39 కంపెనీలు లాభపడ్డాయి. ఎల్అండ్ టీ, ఎస్బీఐ, బీహెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐడియా తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఇన్ ఫ్రాటెల్, హెచ్సీఎల్ టెక్, ఐచర్ మోటార్స్, బోష్ లిమిటెడ్, రిలయన్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,747 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,408 కంపెనీలు లాభాలను, 1,142 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు రూ. 97,02,584 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 98,11,322 కోట్లకు పెరిగింది.

More Telugu News