: జింబాబ్వే సిరీస్ కు కోహ్లీ, రోహిత్, ధావన్ దూరం

కెరీర్ లోనే అద్భుత ఫామ్‌ కనబరుస్తున్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న జింబాబ్వే పర్యటనలో ఈ ముగ్గురికి విశ్రాంతినివ్వాలని, తద్వారా రిజర్వ్ బెంచ్ ను పరీక్షించవచ్చని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గత అక్టోబర్‌ నుంచి విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న ఈ ముగ్గురికి జింబాబ్వే పర్యటనలో కాస్త రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా, ఈ పర్యటనలో భారత్‌, జింబాబ్వేతో మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ ఏడాది 17 టెస్టులకు కెప్టెన్సీ చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కోహ్లీకి; విరామం లేకుండా ఆడినందుకు ధావన్, రోహిత్ లకు విశ్రాంతినివ్వనుండగా, మరి ధోనీ అందుబాటులో ఉంటాడో, ఉండడో అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. దీంతో ధోనీ కూడా విశ్రాంతి కోరుకుంటే గతేడాదిలా రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ లో రాణిస్తున్న దేశవాళీ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ ఈ సిరీస్ లో ఆడే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News