: 'హైపర్ టెన్షన్'లో హైదరాబాదీలే టాప్!

వెరీ హై హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) తో బాధపడుతున్న వారిలో హైదరాబాదీలు ముందు నిలిచారు. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్ కతా తదితర నగరాలతో పోలిస్తే, హైదరాబాద్ లో ఉన్న వారు హైపర్ టెన్షన్ తో అధికంగా బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన సర్వే పేర్కొంది. ఇటీవల నాలుగో విడత నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నిర్వహించిన ఆరోగ్య శాఖ, దాని వివరాలను వెల్లడించింది. దీని వివరాల ప్రకారం హైదరాబాదీల్లో 4.5 శాతం మంది అత్యంత ప్రమాదకరమైన వెరీ హై హైపర్ టెన్షన్ అనుభవిస్తున్నారు. ఇదే సమయంలో చెన్నైలో 3 శాతం, కోల్ కతా, పాట్నా నగరాల్లో 0.5 శాతం, గోవాలో 0.1 శాతం, బెంగళూరులో 0.7 శాతం మంది మాత్రమే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. మొత్తం 17 నగరాల్లోని 20 వేల మందిని సర్వేలో భాగం చేశామని, రక్తపోటు 180/110 దాటుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆరోగ్యంగా జీవించాలంటే రక్తపోటు స్థాయి 140/90 దాటకుండా చూసుకోవాలని, ఒకవేళ మధుమేహ వ్యాధి ఉన్నట్లయితే, రక్తపోటు 135/85 మించరాదని కాంటినెంటల్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ ఎల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అయితే, రక్తపోటు పెరగడం, తగ్గడం ద్వారా రిస్క్ ఒక వ్యక్తికి, మరో వ్యక్తికీ మారుతూ ఉంటుందని తెలిపారు. 140/90 స్థాయిని మించిన బీపీ ఉన్న వ్యక్తులు ఏదో ఒకనాడు కుటుంబంపై ఆర్థిక భారాన్ని మోపుతారని అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్లడ్ ప్రజర్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ సీ వెంకట ఎస్ రామ్ హెచ్చరించారు. వీరిలో బ్రెయిన్ హ్యామరేజ్, గుండెపోటు, కిడ్నీలు పాడైపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని వివరించారు.

More Telugu News