: యూకేలోని ఉక్కు కంపెనీని రూ. 95కు అమ్మేసిన టాటా... నష్టమేం లేదట!

బ్రిటన్ లోని స్కంతోర్ప్ స్టీల్ ప్లాంట్... టాటా స్టీల్ నిర్వహిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీ. దశాబ్దాల పాటు లాభాల్లో కొనసాగి, వందలాది మంది కార్మికులకు ఉపాధిని అందించిన కర్మాగారం. ఇప్పుడు పెను నష్టాల్లో కూరుకుపోయిన వేళ, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేబుల్ కాపిటల్ సంస్థకు కేవలం 1 పౌండు (దాదాపు రూ. 95) కు అమ్ముకుంది. ఇదే సమయంలో సంస్థ చెల్లించాల్సిన రుణాలు, కార్మికులకు ఇవ్వాల్సిన పెన్షన్లు తదితర చెల్లింపుల బాధ్యత టాటా స్టీల్ దే. ఉక్కు ఫ్యాక్టరీని రూ. 95కు అమ్మడమా? కిలోలెక్కన ఇనుము అమ్ముకున్నా లక్షలు సంపాదించవచ్చు కదా? అని ఎవరికైనా అనుమానం వస్తుంది. ఈ డీల్ టాటా స్టీల్ కు వ్యతిరేకంగా ఉన్నట్టు మాత్రమే కనిపిస్తోంది. కానీ అనలిస్టులు మరో రకంగా ఆలోచిస్తున్నారు. ఈ లావాదేవీతో టాటా స్టీల్ కు మేలేనని అంటున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉక్కు పరిశ్రమలు గణనీయంగా పెరిగాయి. అత్యాధునిక సాంకేతికతతో తక్కువ ఖర్చుతో ముడి ఇనుమును ఉక్కుగా మారుస్తూ, కంపెనీలు దూసుకెళుతున్న వేళ, ధరలు సైతం తగ్గుతుంటే, టాటా స్టీల్ సంప్రదాయ ఉక్కు తయారీ పద్ధతులు లాభాలను అందించవు. "టాటా స్టీల్ కు యూకేలో ఉన్న ఆస్తులన్నీ నష్టాన్ని కలిగించేవే. ఈ డీల్ సంస్థకు పాజిటివ్" అని మెక్వైర్ కాపిటల్ ప్రతినిధి రాకేష్ అరోరా వ్యాఖ్యానించారు. ఈ ఆస్తుల నుంచి ఒక్క రూపాయి కూడా రాదని, మొత్తం విలువను సున్నాగా భావిస్తున్న వేళ, రూ. 95 రావడం గొప్పేనని అన్నారు. అసలీ డీల్ విలువలకు సంబంధించినది కాదని, రిస్క్ తగ్గించుకుని, మరింత నష్టపోకుండా చూసుకునేందుకేనని టాటా స్టీల్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌషిక్ చటర్జీ వ్యాఖ్యానించారు. ఈ కంపెనీ నిర్వహణ టాటా స్టీల్ చేతుల్లో ఉంటే సాలీనా 1.4 మిలియన్ డాలర్లు నష్టపోవాల్సి వస్తుందని, ఆ డబ్బంతా తమకిప్పుడు లాభమని టాటా స్టీల్ చెబుతోంది. బ్రిటన్ లో నిర్మాణ రంగం వృద్ధి ఎంతమాత్రమూ పెరగక పోవడమే టాటా స్టీల్ ఉక్కు సంస్థకు విఘాతంగా మారింది. ఈ సంస్థ నిర్మాణ రంగంలో వాడే ఉక్కునే ప్రధానంగా ఉత్పత్తి చేస్తుండటం, బ్రిటన్ లో కొత్తగా గృహాలను నిర్మించేవారు కరవైన పరిస్థితి కారణంగా సంస్థ లాభాలు గత దశాబ్దకాలంగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అందువల్లే రూ. 95కు ఓ కంపెనీని అమ్మేసినా సంస్థకు నష్టం లేదంటున్నారు నిపుణులు.

More Telugu News