: కొత్త పెళ్లి కూతురి ముందు అనగూడని మాటలు!

ఇది వివాహాల కాలం. ఎక్కడ చూసినా భాజాభజంత్రీల జోరు వినిపిస్తుండగా, కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. ప్రతి కుటుంబమూ ఏదో ఒక వివాహ శుభకార్యానికి వెళ్లిరాక తప్పనిసరి పరిస్థితి. గంపెడాశతో మండపం ఎక్కి, తనకు నచ్చిన వరుడి చేత తాళి కట్టించుకునే సమయంలో వధువు మనసులో ఎన్నో భయాలు, ఆందోళన ఉండటం సహజం. ఈ సమయంలో అతిథులుగా వెళ్లిన వారు పెళ్లి కూతురితో ఒక్క మాటైనా మాట్లాడాలని అనుకుంటారు. దగ్గరి వాళ్లయితే, తమకు తోచిన సలహాలు, సూచనలు ఇవ్వాలని భావించడం సహజమే. ఈ సమయంలో పెళ్లి కూతురి ఆందోళనను మరింతగా పెంచేలా చెప్పకూడని మాటలివి. * వెంటనే ఓ బిడ్డను కనెయ్!... ఇలా అనడం వల్ల కేవలం పిల్లల్ని కనే యంత్రాన్నా నేను? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ముందు ఆమె జీవిత భాగస్వామితో సెటిల్ కావాలి. అతని ఆలోచనలు, వ్యక్తిగత జీవితంతో మమేకం కావాలి. ఆ తరువాత పిల్లల ఊసు వస్తే బాగుంటుంది. ముందే పిల్లల గురించి చెప్పి భయాన్ని కలిగించరాదు. * చూసుకో... ఇంకా లావుగా కనిపిస్తున్నావు!... ఓ అందమైన వెడ్డింగ్ డ్రస్ లో మరింత అందంగా కనిపించాలన్న ఆశతో, ఎన్నో రోజుల ముందు నుంచే పెళ్లికూతురు డైటింగ్ వంటివి చేస్తుంటుంది. అలాంటి సమయంలో ఆమె ఆనందాన్ని అలాగే కొనసాగించాలి కానీ, ఈ తరహా మాటలు కూడదు. * ఆంటీ అనవద్దు!... ఎంత పెళ్లవుతున్నా అప్పుడే ఆంటీ అయిపోతారా? అలా అనడం వల్ల పీటలపై ఉన్న పెళ్లి కూతురి ముఖం వాడిపోతుంది. ముఖ్యంగా చిన్నారులు అలా పిలవకుండా చూసుకోవాలి. * పెళ్లికి ఎంత ఖర్చు పెడుతున్నారేంటి?... కల్యాణ మండపాన్ని తీర్చిదిద్దడం నుంచి, అతిథులకు విందు భోజనం వరకూ అప్పటికే ఎంతో మొత్తాన్ని పెళ్లి కూతురి తల్లిదండ్రులు ఖర్చు చేసి వుంటారు. హంగు కోసం అలా చేసినా ఖర్చు విషయంలో వారి బాధ వారికి ఎలాగూ ఉంటుంది. ఆ సమయంలో దాన్ని గుర్తు చేయడం కూడదు. ముఖ్యంగా పెళ్లి కూతురి వద్ద అలా మాట్లాడితే, తనకోసం తన వాళ్లు పెడుతున్న ఖర్చును తలచుకుని ఆమె మనసు బాధతో నిండుతుందని గ్రహించాలి. * అక్కడేం జరుగుతోందో తెలుసా?... పెళ్లి అన్నాక, వరుడి తరఫువారు తమ కోరికల కోసం ఎక్కడో ఒక చోట అలగడం, సదుపాయాలు సరిగ్గా లేవని చిన్నబుచ్చుకోవడం మామూలే. ఇలాంటివి కనీసం పెళ్లి తంతు పూర్తయి అందరూ వెళ్లిపోయే వరకూ వధువు దృష్టికి తీసుకురాకుంటేనే మంచిది. * ఇక చివరిగా, వివాహ బంధం కలకాలం నిలవాలని కోరుకుంటున్నామని, ఎలాంటి తగవులూ వద్దని, విడాకుల వరకూ వెళ్లవద్దని సలహా, సూచనలు ఇవ్వడం మానుకోవాలి. పెళ్లంటేనే నూరేళ్ల పంట. వధూవరులు కలకాలం సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తే తప్పు లేదు కానీ, ఆ విషయాన్ని పెళ్లి కూతురి వద్ద ప్రస్తావించి, తగు జాగ్రత్తలు చెబుతూ, ఆమెలోని భయాన్ని మరింతగా పెంచకుండా ఉంటేనే మేలు.

More Telugu News