: టైంకు పని కావట్లేదా? ఇలా చేసి చూడండి!

ఒక్కోసారి ఎంత బుర్ర గోక్కుని ఆలోచించినా, కష్టపడినా అనుకున్న పని సమయానికి పూర్తి కాదు. సమయపాలన విషయంలో ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. టైంకు పని కావట్లేదని అనుకునేవారెందరో... ఇటీవలి కొన్ని రీసెర్చ్ లు, పరిశోధనల వివరాల ప్రకారం, అనుకున్న సమయానికి పని పూర్తి కావాలంటే, ఇలా ప్రయత్నించి చూడండి. * ప్రతి రోజూ మానవ శక్తి కొద్ది గంటలు మాత్రమే పూర్తి స్థాయిలో పని చేస్తుందట. ఆ సమయాన్ని గుర్తించి ముఖ్యమైన పనులను తలపెడితే విజయం సాధించవచ్చు. * దీన్ని ఎలా తెలుసుకోవాలంటే, రోజులో మీరు ఉత్సాహంగా, నిర్విరామంగా కనీసం గంటన్నర పాటు ఏ సమయంలో పని చేయగలుగుతారో గుర్తించగలిగితే సరిపోతుంది. ఆ సమయం ఏంటన్నది పట్టుకుంటే, కీలక కార్యకలాపాలు సులువుగా చక్కబెట్టుకోవచ్చు. * చేయాల్సిన పనులను మరింత చిన్న చిన్నవిగా విడగొట్టుకోవాలి. ఆఫీసులో ఓ గంట వ్యవధిలో 10 ఫైళ్లు పూర్తి చేయాలని అనుకుంటే, పావుగంటకు మూడు ఫైళ్లు కదిలించాలని టార్గెట్ పెట్టుకోవాలి. ఇక అలా చేయగలిగితే, ప్రతి పావుగంటకూ మీరు కొన్ని నిమిషాల విశ్రాంతి సమయం లభిస్తుంది. * తినే భోజనం కూడా సమయపాలనను సరి చేస్తుంది. ముఖ్యంగా వంకాయ, క్యారెట్, చాక్లెట్ వంటివి భోజనం సమయంలో తీసుకుంటే మెదడులో ఏకాగ్రత పెరుగుతుందట. * ఇక గంటల తరబడి కుర్చీలకు అంకితం కాకుండా, ప్రతి రెండు గంటలకూ కనీసం ఐదు నుంచి పది నిమిషాలు అటూ ఇటూ తిరిగితే, ఆపై కొంతసేపు చురుగ్గా పనిచేయగలుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి.

More Telugu News