: 10 వేల మందికి ఉద్యోగాలివ్వనున్న జెన్ పాక్ట్... హైదరాబాద్ లో 3 వేల మంది

బీపీఓ సేవలందిస్తున్న జెన్ పాక్ట్ వచ్చే ఏడాది వ్యవధిలో 10 వేల మందిని విధుల్లోకి తీసుకోనుంది. వీరిలో 3 వేల మందిని ఒక్క హైదరాబాద్ లోనే తీసుకోనున్నామని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఫైనాన్షియల్ సేవల విశ్లేషణ విభాగం హెడ్ అమిత్ భాస్కర్ తెలిపారు. "హైదరాబాద్ కార్యాలయంలో ఫైనాన్స్, అకౌంటింగ్, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, టెక్నాలజీ తదితర రంగాల్లో నూతనంగా ఉద్యోగులను నియమించనున్నాం. ప్రపంచంలోనే థర్డ్ పార్టీ అనలిటిక్స్ సేవలందిస్తున్న అతిపెద్ద సంస్థగా నిలిచిన జెన్ పాక్ట్ లో కేవలం విశ్లేషణల విభాగంలోనే 6 వేల మంది పనిచేస్తున్నారు" అని ఆయన వివరించారు. సాలీనా 1400 నుంచి 1500 మందిని అనలిటిక్స్ సెగ్మెంట్ లో తీసుకుంటున్నామని, ప్రస్తుతం గుర్ గాం, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో జెన్ పాక్ట్ కేంద్రాలుండగా, త్వరలో ఐదవ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా, హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ తో జెన్ పాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇక్ఫాయ్ విద్యార్థులకు అనలిటిక్స్, రీసెర్చ్ ప్రోగ్రామ్ ను తాము అందించనున్నామని అమిత్ వివరించారు. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వారు జెన్ పాక్ట్ లో అనలిటిక్స్ విభాగంలో ఉద్యోగాలకు అర్హత పొందుతారని తెలిపారు.

More Telugu News