: స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? ఏ ధరలో ఎలాంటి ఫోన్ వస్తుందంటే..!

ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఇమిడిపోయిన వేళ... ఇప్పటికీ భారత మార్కెట్ అపారంగానే కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యమూ వేల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతున్నాయి. అన్ని వర్గాలకూ అందుబాటు ధరల్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. ఎటొచ్చీ వాటిల్లోని ఫీచర్లు, పనితీరులోనే తేడా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఏ ధరలో ఎటువంటి ఫీచర్లతో ఏ కంపెనీల ఫోన్లు అందుబాటులో ఉన్నాయంటే... రూ. 4,500 నుంచి రూ. 7 వేల మధ్య..: ఇది అల్ట్రా చీఫ్ సెగ్మెంట్, 4జీ తరంగాలకు మద్దతిచ్చే ఫోన్లూ అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటి నుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు. అంతమాత్రాన పనితీరు బాగుండదని కాదు సుమా. 2 జీబీ ర్యామ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ వరకూ బ్యాటరీ, 13 ఎంపీ వరకూ కెమెరాలు, పలు రకాల సెన్సార్లు ఈ రేంజ్ ఫోన్లలో ఉంటాయి. ఉదాహరణ - జియోమీ రెడ్ మీ2 ప్రైమ్, లెనోవో ఏ6000 ప్లస్, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ జూస్ 2, యూ యుఫోరియా తదితరాలు. రూ. 7 వేల నుంచి రూ. 13 వేల మధ్య..: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెగ్మెంట్ ఇదే. చౌక ఫోన్లతో పోలిస్తే మరిన్ని ఫీచర్లు వీటి సొంతం. ఆండ్రాయిడ్ 5.0, విండోస్ ఫోన్లయితే 8.1 వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్, హై రెజల్యూషన్ కెమెరాలు, ఫుల్ హెడ్డీ, వాటర్ ప్రూఫ్ డిజైన్లు, ఫ్రంట్ ఫ్లాట్, ఫింగర్ ప్రింట్ స్కానర్లూ ఉంటాయి. ఉదాహరణ - మోటో జీ (జన్ 3), లెనోవో కే3 నోట్, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5, కూల్ పాడ్ నోట్ 3, ఆసుస్ జన్ ఫోన్ 2 లేజర్, జియోమీ ఎంఐ4. రూ. 13 వేల నుంచి రూ. 20 వేల మధ్య..: ఇన్నాళ్లు తక్కువ రేంజ్ స్మార్ట్ ఫోన్ ను వాడిన వారు వెళుతున్న సెగ్మెంట్ ఇది. మరింత మంచి మెటీరియల్ తో తయారై, తక్కువ మందంతో, బరువుతో ఈ రేంజిలో స్మార్ట్ ఫోన్లు లభిస్తాయి. 3 నుంచి 4 గిగాబైట్ల రామ్, మరింత స్టోరేజ్, మెరుగైన కెమెరాలు, మంచి బ్యాటరీ సామర్థ్యం వీటి సొంతం. ఉదాహరణ - మోటో ఎక్స్ ప్లే, ఆసుస్ జన్ ఫోన్ సెల్ఫీ, లెనోవో పీ1, మైజూ ఎంఎక్స్ 5, సోనీ ఎక్స్ పీరియా ఎం4, ఆక్వా. రూ. 20 వేల నుంచి రూ. 26 వేల మధ్య..: రూ. 13 వేల నుంచి రూ. 20 మధ్య స్మార్ట్ ఫోన్లకు, ఈ సెగ్మెంట్ కూ పెద్దగా తేడా కనిపించదు. అయితే, కంపెనీ బ్రాండ్ నేమ్ ఇక్కడ తెలుస్తుంది. మరింత మెరుగైన కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ పనితీరు, గేమింగ్, మల్టీమీడియా అనుభూతి ఈ రేంజ్ ని ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణ - వన్ ప్లస్ 2, లెనోవో వైబ్, హువావే ఆనర్ 7 తదితరాలు. రూ. 26 వేల నుంచి రూ. 33 వేల మధ్య..: ఈ రేంజ్ ఫోన్లలో ప్రాసెసింగ్ సామర్థ్యం అత్యధికం. అంతకన్నా ఎక్కువగా ట్రాకింగ్ ఫీచర్లు, పెడో మీటర్, ఆక్టా కోర్ ప్రాసెసర్, మరింత షార్ప్ ఇమేజ్ సదుపాయాలు పొందవచ్చు. ఉదాహరణ - యాపిల్ ఐఫోన్ 5ఎస్, గూగుల్ నెక్సస్ 5ఎక్స్, మోటో ఎక్స్ స్టయిల్, శాంసంగ్ గెలాక్సీ నోట్ 4, హెచ్టీసీ వన్ ఈ9ప్లస్. రూ. 33 వేల నుంచి రూ. 40 వేల మధ్య..: ఈ ప్రైస్ రేంజ్ లో అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫీచర్లు, ఫోన్లు లభిస్తున్నాయి. తక్కువ ధరలో ఉన్న ఫోన్లలోని ఫీచర్లే ఉన్నా, మెరుగైన పనితీరు కనబరుస్తాయి. ఉదాహరణ - శాంసంగ్ గెలాక్సీ ఎస్6, ఎల్జీ జీ4, యాపిల్ ఐఫోన్ 6, గూగుల్ నెక్సస్ 6పీ, హెచ్టీసీ వన్ ఎం9 తదితరాలు. రూ. 40 వేల పైన..: 3డీ టచ్, లైవ్ ఫోటోస్, ఎడ్జ్ డిస్ ప్లే వంటి అద్భుత ఫీచర్లు వీటి సొంతం. మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన అధునాతన ఫీచర్లను నింపుకుని మార్కెట్లోకి వస్తాయి. ఎటొచ్చీ కాలం గడిచేకొద్దీ వీటి ధర గణనీయంగా తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణ - శాంసంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, ఐఫోన్ 6ఎస్ తదితరాలు. ఇక మీ బడ్జెట్ ఎంత?, ఏ అవసరాలకు స్మార్ట్ ఫోన్ ను వినియోగించాలని భావిస్తున్నారు? తదితర అంశాల ఆధారంగా ఫోన్ ను ఎంచుకోవాల్సిన బాధ్యత మీదే!

More Telugu News