: చైనా ప్రొడక్టుల్లో ఎన్ని నకిలీవో తెలుసా?

చైనాలో తయారవుతున్న ప్రొడక్టుల్లో 40 శాతం వరకూ నకిలీవి ఉన్నట్టు ఆ దేశ అధికార న్యూస్ ఏజన్సీ 'క్సిన్హువా' వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ ప్రభుత్వ అధికారి తెలిపినట్టు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆన్ లైన్లో అమ్మే ఉత్పత్తుల్లో 59 శాతం మాత్రమే అసలైనవి, నాణ్యమైనవని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిపింది. కాగా, యాపిల్ ఐఫోన్ల నుంచి లగ్జరీ రీటెయిలర్ ఎల్వీఎంహెచ్ వరకూ చైనా నకిలీ ప్రొడక్టుల తయారీదారుల చేతుల్లో నష్టపోయిన గ్లోబల్ బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి. ఎంతో కష్టపడి సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి తయారయ్యే ప్రొడక్టులకు డూప్లికేట్లను తయారు చేసేందుకు చైనాలో వందల కొద్దీ సంస్థలున్నాయి. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సైతం నకిలీ భూతం నోట చిక్కుకుంది. ఆ సంస్థ నుంచి పలువురు అమెరికన్లు ఆర్డర్లు పెట్టగా, డూప్లికేట్ వస్తువులు వెళ్లాయి. దీంతో అమెరికాలో అలీబాబాపై నిషేధం విధించాలన్న యోచనకు ఒబామా సర్కారు రాగా, సంస్థ వ్యవస్థాపకుడు జాక్ మా స్వయంగా లాబీయింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపై ప్రతి ఉత్పత్తినీ స్వయంగా పరిశీలించే డెలివరీ ఇస్తామని ఆయన హామీ ఇచ్చిన తరువాత అలీబాబాను బ్లాక్ లిస్టులో పెట్టాలన్న ఆలోచనను యూఎస్ విరమించుకుంది. 2013తో పోలిస్తే, చైనా కంపెనీలకు వస్తున్న ఆన్ లైన్ ఆర్డర్లు 356 శాతం పెరిగిన నేపథ్యంలో, ఆన్ లైన్ కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు చైనా ప్రభుత్వం సైతం కృతనిశ్చయంతో ఉందని, నకిలీ ప్రొడక్టులు పంపే వారిపై చర్యలుంటాయని చైనా ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News