కరెంటు, నీళ్లు... ఎంత వాడినా రూ. 300... గ్రేటర్ ఎన్నికల వేళ కేసీఆర్ తాయిలాలు!

15-10-2015 Thu 09:35

త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న వేళ, టీఆర్ఎస్ పార్టీని గెలుపు దిశగా నడిపించేందుకు మురికివాడల్లోని ప్రజలపై కేసీఆర్ వరాల జల్లు కురిపించనున్నారని తెలుస్తోంది. ఎంత వాడారన్న విషయంతో సంబంధం లేకుండా, గుర్తించిన స్లమ్ ఏరియాల్లోని పేదలకు కరెంటుపై రూ. 150, మంచి నీటిపై రూ. 150 బిల్లును మాత్రమే వేసే దిశగా ఆదేశాలు జారీ కానున్నట్టు సమాచారం. ఈ మేరకు తన నివాసంలో విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సహచరులతో కేసీఆర్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. జంటనగరాల్లో నోటిఫైడ్ చేసిన మురికివాడలు 1,475 వరకూ ఉండగా, వాటిల్లో దాదాపు 1.25 లక్షల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఒక్కో కుటుంబంలో నాలుగు ఓట్లు ఉన్నాయనుకున్నా మొత్తం 6 లక్షల ఓట్లుంటాయి. వీటిపై కన్నేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పేదల మనసు దోచుకునేందుకు వేయాలనుకుంటున్న ఎత్తుగడల్లో ఇదొకటి. దీంతో పాటు పాత విద్యుత్, నల్లా బకాయిలను రద్దు చేయాలని కూడా నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది.