నాగపూజలు చంద్రబాబు ఎలా చేస్తారు?: వైఎస్సార్సీపి నేత

13-10-2015 Tue 20:16

ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు రాష్ట్రానికి అరిష్టమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,‘ఇటీవల చంద్రబాబు పెదనాన్న కొడుకు మరణించాడు. దీంతో ఈ నెల 15వ తేదీన జరగాల్సిన చంద్రబాబు మనవడి పుట్టువెంట్రుకల కార్యక్రమం రద్దయింది. కర్మ క్రియలు పూర్తయ్యే వరకు ఎటువంటి శుభకార్యాలు చేయరు. కానీ, నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిమిత్తం చంద్రబాబు నాగపూజలెలా చేస్తారు?.ఈ విషయమై మతపెద్దలు ఆయన్ని ప్రశ్నించాలి’ అని ఆయన అన్నారు. ఇంట్లో శుభకార్యాలే చేయకూడదన్నప్పుడు, నవ్యాంధ్ర రాజధాని శుభకార్యపు పనులు చేయాలనుకోవడం మతవిశ్వాసాలను పక్కనపెట్టడమే అవుతుందని చెవిరెడ్డి ధ్వజమెత్తారు.