డిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: ఆప్

03-08-2014 Sun 08:30

ఢిల్లీలో ప్రజాస్వామ్య పద్ధతిలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ధర్నాకు దిగనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ఈ ధర్నాలో పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పాల్గొననున్నారు. ఆమధ్య జరిగిన ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీకీ షాకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, పూర్తి మెజార్టీ రాని నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్, అనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేశారు. అంతేకాక ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాని నేపథ్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించడమొక్కటే మార్గమని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రజలు అందించిన అధికారాన్ని కాపాడుకోలేని అసహాయ వ్యక్తిగా కేజ్రీవాల్ ను అభివర్ణించిన కాంగ్రెస్, బీజేపీలు రెండోమారు ఎన్నికలకు అంత సుముఖంగా లేవు. ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆప్ కార్యక్తల వైఖరిని ఖండిస్తున్నారు. ఐదేళ్లకోమారు జరగాల్సిన ఎన్నికలను ఏటా నిర్వహించడం ఎంతవరకు సబబని కూడా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.