బాబు, కేసీఆర్ పందెం కోళ్లలా వ్యవహరిస్తున్నారు: రఘువీరా

02-08-2014 Sat 16:22

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పందెంకోళ్లలా వ్యవహరిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. శ్రీకాకుళం పట్టణంలో జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి పంతాలకు, పట్టింపులకు పోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని సామరస్యపూర్వకంగా నిర్వహిస్తే, వీరి పంతాల కారణంగా ప్రజల్లో విద్వేషాలు రేగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధమని ఆయన సవాలు విసిరారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల తరఫున పెద్దఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంటుపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టనుందని ఆయన తెలిపారు.