పర్యాటకుల పెరుగుదలతో ఆ మూగప్రాణులకు ఎన్ని కష్టాలో..!

01-08-2014 Fri 17:33

గోవా తీరంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. విహారయాత్ర నిమిత్తం గోవాకు దేశ విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో, అక్కడి బీచ్ లు ఇసుకేస్తే రాలనంతగా తయారయ్యాయట. ఈ పరిణామం కాస్తా అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ళ పాలిట శాపంగా పరిణమించింది. వాటి జీవితచక్రాన్ని అనుసరించి అవి గుడ్లు పెట్టేందుకు తీరప్రాంతానికి రావాల్సి ఉంటుంది. పర్యాటకుల తాకిడి కారణంగా తీరానికి వచ్చేందుకు వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టూరిస్టుల రాకతో రాత్రివేళల్లోనూ బీచ్ లలో లైట్లు వెలుగుతుండడంతో ఈ వలస తాబేళ్ళు గుడ్లు పెట్టేందుకు తగిన నెలవులను ఎన్నుకొనలేకపోతున్నాయని గోవా అటవీ శాఖ మంత్రి అలీనా సల్దానా చెప్పారు. తాబేళ్ళు గుడ్లు పెట్టే కాలంలో బీచ్ లలో రాత్రివేళ లైట్లు వేయరాదని, పెద్దగా ధ్వనులను వినిపించరాదని ఆదేశాలు జారీచేసినట్టు సల్దానా వెల్లడించారు. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ప్రతి ఏడాది వేల మైళ్ళ దూరం ప్రయాణించి ఒడిశా, గోవా తీరాల్లో గుడ్లు పెడతాయి. అనంతరం అవి సముద్రంలోకి వెళ్ళిపోగా, గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు తిరిగి సముద్రంలోకి చేరుకుంటాయి. ఈ క్రమంలో గుడ్లకు, పిల్ల తాబేళ్ళకు ఎన్నో ప్రతికూల శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. నక్కలు ఇసుకను తవ్వి గుడ్లను తినేస్తాయి. ఇక, ఈ తాబేలు పిల్లలు సముద్రంలోకి చేరుకునే క్రమంలో గ్రద్దలకు, ఇతర పక్షులకు ఆహారంగా మారతాయి. మిగిలిన కొన్ని తాబేళ్ళు మాత్రమే సముద్రంలోకి వెళతాయి.