పార్లమెంటు ఆవరణలో కిష్కింధకాండ!

01-08-2014 Fri 17:04

పార్లమెంటు ఆవరణలో గతకొంతకాలంగా కోతుల బెడద తీవ్రమైంది. ఎన్నిసార్లు వాటిని తరిమినా అవి మళ్ళీ అక్కడకే వచ్చి చేరుతుండడంతో ఢిల్లీ పురపాలక అధికారులు విసుగెత్తిపోయారు. దీంతో, వారో విచిత్రమైన ప్రణాళిక రచించారు. ఓ నలభై మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారికి కొండముచ్చు వేషాలు తగిలించి కోతులపైకి ఉసిగొల్పారు. ఆ వానరాలు మరీ ప్రమాదకరంగా ప్రతిస్పందించిన సమయాల్లో రబ్బరు బుల్లెట్లు కూడా ప్రయోగిస్తున్నారట వాళ్ళు. ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. పనిలోపనిగా పార్లమెంటు ఆవరణలో ఉన్న ఊరకుక్కలనూ ఓ చూపు చూసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారట.