దివానుగా మారిన పశువుల కాపరి !

దివానుగా మారిన పశువుల కాపరి !
ఆదోని సమీపంలోని ఓ గ్రామంలో వెంకన్న అనే ఓ అమాయకుడు ఉండేవాడు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన వెంకన్న మేనమామ దగ్గర పెరుగుతాడు. వెంకన్నకు చదువు చెప్పించి ప్రయోజకుడిని చేస్తే, అతని ఆస్తిపాస్తులు అతనికి అప్పగించవలసి వస్తుందని మేనమామ భావిస్తాడు. అందువలన అక్షరజ్ఞానం లేకుండా చేసి పశువులకాపరిగా మారుస్తాడు.

ఈ నేపథ్యంలోనే వెంకన్న శ్రీ రాఘవేంద్రస్వామి గురించి వింటాడు. ఆ స్వామిని దర్శించుకోవాలని ఆరాటపడుతూ వుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఓ రోజున తన శిష్యులతో కలిసి రాఘవేంద్రస్వామి అటుగా వస్తాడు. పరుగుపరుగున వెళ్లి స్వామి పాదాలపై పడతాడు వెంకన్న. తనకి చదువురాదనీ ... చదువుకోవాలని వుందని స్వామితో చెబుతాడు.

వెంకన్నను ఆశీర్వదించిన రాఘవేంద్రులు ... త్వరలోనే అతనికి ఉన్నతమైన స్థానం లభిస్తుందనీ, అతని జీవితం అనూహ్యమైన మలుపుతిరుగుతుందని చెప్పి వెళ్లిపోతాడు. అమాయకుడైన వెంకన్న ఓ రోజున పశువులు కాసుకుంటూ వుండగా ఆదోని నవాబు అటుగా వస్తాడు. ఆ సమయంలోనే ఆయనకి తన సైనికాధికారి నుంచి లేఖ అందుతుంది. అందులోని భాష తెలియక నవాబు ఆలోచిస్తూ వుండగా, పశువులు కాసుకుంటూ వెంకన్న కనపడతాడు. దాంతో ఆ లేఖను చదివిపెట్టమని అడుగుతాడు నవాబు.

తనకి చదువురాదని వెంకన్న ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాఘవేంద్రస్వామిని తలచుకున్నాడు వెంకన్న. అంతే ఆయన నోటి నుంచి ఆ లేఖలోని విషయాలు వరుసగా బయటికివస్తాయి. అందులో సంతోషకరమైన సమాచారం ఉండటంతో, నవాబు ఆనందంతో పొంగిపోతాడు.

వెంకన్న తనకేమీ తెలియదని చెప్పడానికి కారణం ఆయన వినయ విధేయతలుగా నవాబు భావిస్తాడు. ఆయనని దివానుగా నియమిస్తున్నాననీ ... ఆదోని వచ్చి ఆ పదవిలో చేరమని చెప్పి వెళ్లిపోతాడు. కొంతసేపటి వరకూ జరిగినదంతా కలగానే అనిపించినా ఇదంతా రాఘవేంద్రస్వామి మహిమగా భావించిన వెంకన్న, మనసులోనే ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు. మంచి రోజు చూసుకుని ఆదోని నవాబు దగ్గర దివాను పదవిని అలంకరిస్తాడు.

More Bhakti Articles