త్యాగయ్యకి లభించిన వరం!

త్యాగయ్యకి  లభించిన వరం!
త్యాగయ్యకి శ్రీరాముడే సర్వస్వం ... నిరంతరం ఆయన శ్రీ రామచంద్రుడి రూపాన్ని చూస్తూ ... ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. శ్రీరాముడిని ఆశువుగా కీర్తిస్తూ ... ఆయన ధ్యానంలో తరించాలని ఆరాటపడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీరాముడి గురించి కొన్ని పదాలు రాసుకుని వాటిని ఆలపిస్తూ వీధుల్లో తిరిగేవాడు. ఆ పదాలను విన్న వాళ్లు తమకి తోచినది ఆయనకి ఇచ్చేవాళ్లు.

ఆయన మానాన ఆయన పదాలు పాడుకుంటూ తిరుగుతున్నా కొందరు కావాలని ఎగతాళి చేస్తుండేవారు. ఈ విషయం తెలిసి త్యాగయ్య ఆన్నగారు బాధపడుతూ ఉండేవాడు. కుటుంబం గడిచే విషయంలో తనకి సహకారిగా ఉండమని ఆయన త్యాగయ్యని కోరేవాడు. అయినా ఆయన తన ధోరణిని మార్చుకునే వాడు కాదు.

కొండకోనలపై నుంచి దూకే జలపాతాలు లయబద్ధంగా సవ్వడి చేయడం ... పక్షులు లయబద్ధంగా కూయడం ... గాలికి చెట్ల కొమ్మలు లయబద్ధంగా కదలడం ఆయన గమనించాడు. అలా సహజంగా సంగీతం ... పాండిత్యం తనకి అలవడనందుకు త్యాగయ్య ఆవేదన చెందాడు. శ్రీరాముడిని రెప్పవాల్చక చూస్తూ ఆశువుగా కీర్తించలేని తన అసహాయతను నిందించుకున్నాడు. తాను చేసిన పాపమేవిటని శ్రీరాముడి చెంత కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఆయన మనసుని శ్రీమన్నారాయణుడు అర్థం చేసుకున్నాడు. ఆయన ఆదేశం మేరకు నారదమహర్షి మారువేషంలో త్యాగయ్య ఇంటికి వచ్చాడు. తాను కూడా శ్రీరాముడి భక్తుడినేనంటూ పరిచయం చేసుకున్నాడు. ఆయన దగ్గర ఆవేదనను వ్యక్తం చేశాడు త్యాగయ్య. నారదమహర్షి రచించిన 'స్వరాన్నం' అనే సంగీత ప్రధానమైన గ్రంధం ఒకటి తన దగ్గర ఉందనీ, పనికి వస్తుందేమో చూడమని దానిని ఆయన త్యాగయ్యకి అందజేశాడు.

ఆ గ్రంధం తెరవగానే తనకి కావలసినది అదేనని త్యాగయ్యకి అర్థమైపోయింది. ఆ విషయం చెబుదామని ఆయన అనుకునేంతలో నారదమహర్షి అదృశ్య మైపోయాడు. ఆ గ్రంధ పఠనం వలన ... దైవానుగ్రహం వలన త్యాగయ్యకి అపారమైన సంగీత .. సాహిత్య జ్ఞానం అలవడింది. ఆ క్షణం నుంచే ఆయనలో ఆశుకవిత పొంగిపొర్లింది ... సంకీర్తనల రూపంలో సరిహద్దులు దాటి ప్రవహించింది.

More Bhakti Articles